Asianet News TeluguAsianet News Telugu

ఆర్థిక పరిస్థితి బాలేకుంటే అదనంగా సలహాదారులు ఎందుకు?: సీఎం జగన్ కు ఎమ్మెల్యే నిలదీత

జగన్ ప్రభుత్వానికి ఉద్యోగుల కంటే సలహాదారులే ఎక్కువయినట్లున్నారని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేసారు.

tdp mla anagani satyaprasad serious on ysrcp government and cm ys jagan
Author
Amaravati, First Published Jan 25, 2022, 1:11 PM IST

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులంటే లెక్కలేకుండా వ్యహరిస్తోందని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (anagani satyaprasad) ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) సలహాదారులకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం లేదని అనగాని మండిపడ్డారు. 

''సలహాదారులకు లక్షల్లో జీతాలు ఇస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. ఉన్న సలహాదారులు చాలక మళ్ళీ అదనంగా ప్రైవేట్ సలహాదారులను నియమించాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ సలహాల వల్ల రాష్ట్రానికి రూపాయి ప్రయోజనం కూడా లేదు. పనికిరాని సలహాదారులకు కోట్లాది రూపాయలు ఇస్తున్నారు కానీ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించరా?'' అంటూ ఎమ్మెల్యే నిలదీసారు. 

''కరోనా సమయంలో సలహాదారులు ఇళ్లల్లో కూర్చుంటే ఉద్యోగులు మాత్రం  తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పని చేశారు.  ప్రభుత్వం కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేసే ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా సలహాదారులకు లక్షల్లో జీతాలు ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం బాధాకరం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, వైసీపీ మంత్రులకు ఉద్యోగస్థులంటే ఎందుకంత చులకనభావం'' అని అనగాని అడిగారు. 

''ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి వాటిని నెరవేర్చమంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేదంటూ సాకులు చెబుతారా? రాష్ట్ర పరిస్థితి బాలేనప్పుడు కొత్తగా ప్రైవేట్ సలహాదారులను నియమించుకోవాల్సిన అవసరమేంటి? మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జీతాలు తగ్గించుకోవచ్చుకదా? వైసీపీ నేతలకు ప్రజాధనాన్ని దోచిపెడుతూ... ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి అంటూ సాకులు చెప్పడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి తన సలహాదారులకు  కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నారుగానీ ఉద్యోగుల సమస్యలు ఎందుకు పరిష్కరించరు?'' అని ప్రశ్నించారు. 

''ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం 43శాతం ఫిట్ మెంట్ తో పిఆర్సి ఇచ్చింది. చంద్రబాబు నాయుడు పాలనలో 62 జీవోలనిచ్చి ఉద్యోగుల సంక్షేమానికి బాటలు వేస్తే నేడు జగన్ నాలుగు జీవోలతో ఆ సంక్షేమానికి బీటలు వారేలా వ్యవరించారు. ఉద్యోగుల జీతాల్లో కోత కోయడమేగాక వారినుంచి రివర్స్ లో బకాయిలు రికవరీ చేసేందుకు సిద్ధం కావడం దారుణం. ప్రభుత్వానికి,  ఉద్యోగులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలి. ఉద్యోగుల సంక్షేమానికి తూట్లు పోడుస్తున్న నాలుగు జీవోలను రద్దు చేయాలి'' అని అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios