గుంటూరు: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన అనగాని సత్యప్రసాద్ బీజేపీతో మళ్లీ కలుస్తారా? అన్న ప్రశ్నకు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా అంటూ చెప్పుకొచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ భజన తప్ప ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చలేదని విమర్శించారు. తెలంగాణ భూభాగంలో ఏపీ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం ఆలోచించడం సరికాదని హితవు పలికారు. ఏపీ ప్రజల సొమ్ముతో తెలంగాణకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. 

నీటి విషయంలో రెండు రాష్ట్రాల మధ్య చేసుకున్నది ఒప్పందం కాదని కేసీఆర్-జగన్ మధ్య లాలూచీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన సాయానికి క్విడ్‌ప్రోకో తరహాలో జగన్ రుణం తీర్చుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒకప్పుడు జగన్ కు హిట్లర్ లా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు దేవుడిలా కనిపిస్తున్నారా అంటూ నిలదీశారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన 63 రోజుల్లో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. 

రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితే నేడు తలెత్తిందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో భగవద్గీత, బైబిల్‌ని చెప్పిన జగన్ దాని అమలు కోసం కృషి చేయడం లేదని విమర్శించారు. అన్న క్యాంటిన్లు మూసేయడం సరికాదన్నారు. పేరు మార్చైనా ప్రజలకు అన్నం పెట్టాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విజ్ఞప్తి చేశారు.