అమరావతి: దమ్ముంటే ఈ ఏడాది పట్టిసీమ ప్రాజెక్టు మోటార్లు నిలిపివేయాలని టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పట్టిసీమ వల్ల  ఏ మేరకు ఎంత ఖర్చు చేశాం...రైతులకు ఏ మేరకు ప్రయోజనం కలిగిందనే విషయమై లెక్కలు తీయాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల మధ్య సోమవారం నాడు వాడీ వేడీ చర్చ సాగింది. పోలవరం, పట్టిసీమలపై ఈ రెండు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకొన్నాయి. రెండు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ వాదనలను బలంగా విన్పించే ప్రయత్నం చేశారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చను సోమవారం నాడు ప్రారంభించారు. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి ఈ చర్చను ప్రారంభించారు. ఈ  చర్చ సందర్భంగా  రెండు పార్టీల మధ్య  చర్చ వాదోపవాదాలు చోటు చేసుకొన్నాయి.

పట్టిసీమ వల్ల రైతులు ఏ మేరకు ప్రయోజనం పొందుతున్నారో తెలుసుకోవాలని అచ్చెన్నాయుడు వైసీపీకి సూచించారు. పోలవరం ప్రాజెక్టును 70 శాతం తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఇంకా 30 శాతం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

వైఎస్ జగన్ సీఎం కాగానే ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సమయంలో  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తమకు సంబంధం లేదని ప్రకటించారన్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చిన  తర్వాత  పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తామే చేపడుతామని  సీఎం ప్రకటించారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.

తమ ప్రభుత్వ హయంలో పోలవరంపై వృధఆగా ఖర్చు చేశామని అధికార పార్టీ చెబుతోందని... కానీ, మీరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో డబ్బులను ఆదా చేస్తే మేమంతా  మిమ్మల్ని సన్మానిస్తామని  అచ్చెన్నాయుడు చెప్పారు.

ఐదేళ్ల కాలంలో  తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టుగా ఆయన గుర్తు చేశారు.తమ పార్టీ  ఓడిపోయినంత మాత్రాన అభివృద్ది చేయలేదా...అని ఆయన ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ఏ మేరకు అభివృద్ది జరిగిందో మీ ఇష్టమొచ్చిన జిల్లాకు వెళ్లి పరిశీలించాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.

పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి ప్రయోజనం కలిగిందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒప్పుకొన్నారు. కానీ, పట్టిసీమలో చోటు చేసుకొన్న అవినీతి గురించే తాము మాట్లాడుతున్నట్టుగా రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు పునాదిరాయి వేసింది వైఎస్ఆర్ అని ఆయన గుర్తు చేశారు.

అంతకుముందు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ లు అచ్చెన్నాయుడులపై విమర్శలు గుప్పించారు.  అచ్చెన్నాయుడు విపక్షంలో కూర్చొన్న కూడ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని  విరుచుకుపడ్డారు. ధర్మపోరాట దీక్షల పేరుతో  రూ,. 500 కోట్లను నాకేశారని విమర్శించారు.

రెచ్చగొట్టేలా మాట్లాడడాన్ని అచ్చెన్నాయుడు మార్చుకోలేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు ఆసుపత్రిలో ఎలుకల నిర్మూలన కోసం కోట్లాది రూపాయాలను డ్రా చేశారని  శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.