అమరావతి:  సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా  టీడీపీ సభ్యత్వ నమోదులో ఈ దఫా రికార్డు సృష్టించింది. ఈ దఫా ఏపీలో  65 లక్షల మేరకు సభ్యత్వాలను పూర్తి చేశారు. రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేర్పించారు. సభ్యత్వాల చేర్పింపులో అగ్రభాగాన నిలిచిన  నియోజకవర్గాల నేతలను పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్  అభినందించారు.

గతంతో పోలిస్తే ఈ దఫా టీడీపీ సభ్యత్వ నమోదు మరింత పెరిగింది. 2016-18 లో 64 లక్షల 42 వేలుగా సభ్యత్వం ఉంది. ఈ దఫా 65లక్షలకు సభ్యత్వ నమోదు చేరుకొంది. రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు అసెంబ్లీ స్థానం ప్రథమ స్థానంలో నిలిచింది.

పాలకొల్లు తర్వాత స్థానాన్ని కుప్పం, ఆ తర్వాత ఉదయగిరి, ఆత్మకూరు, మైలవరం నియోజకవర్గాలు నిలిచాయి. సభ్యత్వ నమోదులో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన నియోజవకర్గాలకు చెందిన పార్టీ నేతలను, కార్యకర్తలను  లోకేష్ అభినందించారు.  కార్యకర్తల సంక్షేమానికి  టీడీపీ కట్టుబడి ఉంటుందని ఆయన ప్రకటించారు.

రెండు రాష్ట్రాల్లోని 4178 టీడీపీ కార్యకర్తలకు రూ.14 కోట్లను ఆర్థిక సహాయంగా ఇచ్చినట్టు లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలోని  3,031 మంది టీడీపీ కార్యకర్తలు మరణిస్తే  ఆ కుటుంబాలకు రూ.60.62 కోట్లను చెల్లించినట్టు ఆయన గుర్తు చేశారు. 

ప్రమాదాల్లో గాయపడిన సుమారు 89 మంది కార్యకర్తలకు రూ.52.80 లక్షలను చెల్లించినట్టు చెప్పారు.టీడీపీ కార్యకర్తలకు చెందిన  సుమారు 815 మంది పిల్లలకు విద్య కోసం ఇతరత్రా అవసరాల కోసం రూ.2.28 కోట్లు సహాయం చేసినట్టు చెప్పారు.  లోకేష్ తెలిపారు.