అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మహానాడులో గురువారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ముందే నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రులు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చినరాజప్ప మహానాడులో తీర్మానం ప్రతిపాదించారు. తన తీర్మానంలో ఆయన పలువురు నేతల తీరును తప్పు పట్టారు. 

అధికారం కోల్పోగానే కొందరు పార్టీకి దూరమయ్యారని ఆయన అన్నారు. పార్టీని వీడినవారిని తిరిగి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. వంశీ, బలరాం, గిరి వెళ్లిపోయి కనుమరుగయ్యారని ఆయన అన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారని ఆయన అన్నారు. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో చంద్రబాబు గుర్తించాలని ఆయన అన్నారు. బాగా పనిచేస్తున్నవాళ్లనే చంద్రబాబు ప్రమోట్ చేయాలని ఆయన అన్నారు. ఇంచార్జీలూ ఎమ్మెల్యేలూ ముఖ్యం కాదని, కార్యకర్తలే ముఖ్యమని ఆయన అన్నారు. ఎంపీటీసీ, కౌన్సిలర్ అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేకపోయారని ఆయన విమర్శించారు. 

చినరాజప్ప వ్యాఖ్యలతో సీనియర్ జ్యోతుల నెహ్రూ విభేదించారు. మైకులు పట్టుకుంటే సరికాదని, క్యాడర్ ను పట్టించుకోవాలని ఆయన అన్నారు. నాయకుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం కాదు, క్యాడర్ చుట్టూ చేయాలని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా ఎవరికీ తెలియదని, చినరాజప్ప మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. 

ఆవభూముల వ్యవహారంపై పరిశీలనకు కమిటీ వస్తే తమకు సమాచారం కూడా లేదని ఆయన చెప్పారు. నరోగా బిల్లుపై కేంద్రానికి విజ్ఢప్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నాయకులు బయటకు వెళ్తారు... వస్తారని ఆయన చెప్పారు. తాము కూడా బయటకు వెళ్లి వచ్చినవాళ్లమేనని ఆనయ చెప్పారు. బయటకు వెళ్తే పార్టీ విలువ ఏమిటో తెలుస్తుందని చెప్పారు. 

చంద్రబాబు ఆశీస్సులతో పార్టీ కార్యకర్త స్థాయి నుంచి పొలిటి బ్యూరో సభ్యుడు, డిప్యూటీ సీఎంను అయ్యానని చినరాజప్ప అన్నారు.    చంద్రబాబు టీడీపీని సంస్ధాగతంగా బలోపేతం చేశారని చెప్పారు. నాదెండ్ల  భాస్కర్ రావు వ్యవహారంలో ఎన్టీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడంలో చంద్రబాబు సమర్థంగా పనిచేశారని ప్రశంసించారు.    

కార్యకర్తలకు, నేతలకు శిక్షణా శిబిరాలకు చంద్రబాబు నాంది పలికారని, మండల, గ్రామ పార్టీ వరకు కూడా చంద్రబాబుఅందరితో మాట్లాడేవారని అన్నారు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు.    జగన్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని, టీడీపీ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక పోయామని అన్నారు. నియోజకవర్గంలో, మండల, గ్రామ, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు చెప్పినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని ఆయన అన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లినా, నేతలు వెళ్లినా బలమైన కేడర్ ఉందని అన్నారు.    మాజీ ఎమ్మెల్యేలు పార్టీ పటిష్టతకు కృషిచేయాలని అన్నారు. కొంతమంది సైలెంట్ గా ఉండటం సరికాదని చెప్పారు.

చంద్రబాబుకూడా ఎవరు పనిచేస్తున్నారో చూడాలని, అందరం బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. దీనిపై నాయకులు పోరాడాలని సూచించారు.కరోనా సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారని అన్నారు.  

టీడీపీ పాలనలో పదవులు అనుభవించిన వారు కనీసం ఎంపీటీసీని పెట్టలేరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మాజీలు పార్టీని వీడినా మండల పార్టీ అధ్యక్షులే టీడీపీ నాయకులను తయారు చేయాలని చినరాజప్ప సూచించారు.

మనం ఐదేళ్లు కష్టబడి సాధించిన అభివృద్ధిని వీళ్లు ఏడాదిలోనే నాశనం చేశారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రతిపక్షాలను నియంత్రించడమే ధ్యేయం తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదని ఆయన జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విపత్కర పరిస్థితుల్లోనూ కార్యకర్తలు పార్టీ కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. ఆర్ధికంగా, సామాజికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నా పార్టీతోనే ఉన్నారని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలోని పెండింగు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కార్యకర్తలకు ఆర్ధిక ఇబ్బందులు సృష్టించి తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. వ్యాపారాలు దెబ్బతీస్తున్నారని, ప్రత్యేకంగా ఉపాధి హామీ నిధులు చెల్లింపుల్లో వివక్ష చూపుతున్నారని అన్నారు. కార్యకర్తల కోసం లోకేశ్  కృషి చిరస్మరణీయమని అన్నారు. 

చంద్రబాబు నాయకత్వాన్ని గుర్తించిన వారు ఎవరూ పార్టీని వీడరని, ఒక వేళ ఎవరైనా పార్టీ వీడినా.. చంద్రబాబులాంటి నాయకుడిని వదులుకోలేరని, ఎప్పటికైనా వెనక్కి వచ్చి తీరాల్సిందేనని ఆయన అన్నారు.