టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లిన సమయంలో.. రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్ లు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  వీరు బీజేపీలోకి వెళ్లడంతో టీడీపీ ఖాళీ అయ్యిందని కొందరు అభిప్రాయపడుతుంటే... చంద్రబాబే పథకం ప్రకారం వారిని బీజేపీలోకి పంపించారనే వాదనలు కూడా వినిపించాయి. 

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇదంతా చంద్రబాబు పథకం ప్రకారం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. అయితే... తాజాగా సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో కలిసి విజయసాయి రెడ్డి భోజనం చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై టీడీపీ అభిమానులు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.

టీడీపీ నుంచి బీజేపీలో చేరికల వ్యవహారాన్ని విజయసాయిరెడ్డే పర్యవేక్షిస్తున్నారన్న చర్చ నెటిజన్లలో జరుగుతోంది.లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా విజయసాయిరెడ్డి, సీఎం రమేష్‌లు పక్కపక్కనే కూర్చున్నారు. గతంలో ఉప్పు, నిప్పులా ఉన్న ఇద్దరూ రెండు గంటలకుపైగా లోక్‌సభలోనే చర్చించుకున్నారు. మిత్రపక్షం బీజేపీని బలోపేతం చేయడంతోపాటు విపక్షాన్ని దెబ్బతీసే ఎత్తుగడను విజయసాయిరెడ్డి అమలు చేస్తున్నారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
 

ఈ టీడీపీ ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి విజయసాయి రెడ్డే కారణమని... ఆయన ప్రోద్భలంతోనే బీజేపీలో  చేరారంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.