విశాఖపట్నం: డిసెంబర్ 25 నుండి ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు... మొదటి విడతగా దాదాపు కోటి మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికన విజయసాయి ప్రకటించారు. ఈ ప్రకటనపై అదే ట్విట్టర్ వేదికన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''ఏటేటి విజయసాయి రెడ్డి... జగ్గడు కరోనా కి మందు కనిపెట్టేసినాడా?ఆ మందు నువ్వు డిసెంబర్ 25న కోటి మందికి పంచేస్తున్నావా? కొంపతీసి బ్లీచింగ్ బిల్లలుగా చేయించుకొని మింగావా?మతిపోయి మాట్లాడుతున్నావు. 6నెలల క్రితం చెప్పిన మూడు మాస్కులే ఇవ్వలేని జగ్గడు కరోనా వ్యాక్సిన్ తయారుచేసా అంటే నువ్వు ఎలా నమ్మావు వీసా'' అంటూ విజయసాయి రెడ్డికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. 

ఇదే విజయసాయి రెడ్డి ట్వీట్ పై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా స్పందించారు. ''పేరాసిట్మాల్, బ్లీచింగ్, వైకాపా ఏలూరు స్పెషల్ వాటర్ కలిపి మిక్సీ కొట్టి జగన్ రెడ్డి తయారు చేసిన కరోనా మందు తమకు కూడా ఇవ్వాలని ప్రపంచ దేశాల అధినేతలు, ఫార్ములా మాకు కూడా ఇవ్వాలంటూ ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయా సాయి రెడ్డి? రాష్ట్ర ప్రజలకు కనీసం మాస్క్ ఇవ్వలేక చేతులెత్తేసిన వాడు వ్యాక్సిన్ ఇస్తాడని పగటి కలలు కంటున్నావా?నీ బుర్రకి తట్టే తప్పుడు లెక్కలు రాసుకోక ట్విట్టర్ పాట్లు ఎందుకు సాయిరెడ్డి'' అంటూ వెంకన్న కౌంటరిచ్చారు.