సారాంశం

టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారానికి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు క్లారిటీ ఇచ్చారు. మహానాడులో 15 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నామన్నారు

తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు సంబంధించి, రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమానికి సంబంధించి మహానాడులో 15 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నామన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానంగా ప్రజల సమస్యలు, ఈ ప్రభుత్వం 4ఏళ్లలో తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మహానాడులోప్రధానంగా చర్చిస్తామని యనమల తెలిపారు. ఇప్పుడు జరిగే మహానాడు ఎన్నికలకు ముందు జరిగేది కాబట్టి ప్రధానాంశాలుంటాయని రామకృష్ణుడు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు టీడీపీ రద్దు చేస్తుంది అనేది అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.  సంక్షేమ పథకాలకు ఆద్యమే తెలుగుదేశం పార్టీ అన్న ఆయన ఎన్.టీ.రామారావు సంక్షేమ పథకాలకు ఆద్యుడని కొనియాడారు.  

ముఖ్యమంత్రులు ఎందరొచ్చినా ఆయన అమలు చేసిన పథకాలనే మార్చిమార్చి చేస్తున్నారని యనమల దుయ్యబట్టారు. ఉన్ నపథకాలను మరింత ఎఫెక్టివ్ గా , అసలైన అర్హులకు లబ్ధి కలిగేలా వారికి అమలుచేయాలని రామకృష్ణుడు తెలిపారు. ఇతను (సీఎం జగన్) ఏం చేశాడు.. వాళ్ల మనుషులకు మాత్రమే పథకాలు అమలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. అర్హులకు అన్యాయం చేస్తున్నాడని యనమల ఫైర్ అయ్యారు. ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశాడని.. వాటిని టీడీపీ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న  పథకాల లోటుపాట్లపై కచ్చితంగా సమీక్ష చేస్తామని తెలిపారు. తెలుగుదేశం అంటేనే సంక్షేమ పథకాలని..  ప్రజల సమస్యలకు పరిష్కారమే టీడీపీ అమలుచేసే సంక్షేమమని రామకృష్ణుడు తెలిపారు. 

అంతకుముందు మహానాడు తీర్మానాలపై యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని కమిటీ సభ్యులు శనివారం భేటీ అయ్యారు. ప్రజా సమస్యలపై దాదాపు 15 నుంచి 19 తీర్మానాలు చేయాలని కమిటీ నిర్ణయించింది. రైతులు, యువత, మహిళ సంక్షేమంపై ఎలాంటి మేనిఫెస్టో రూపొందిస్తామనే దానిపై మహానాడులో టీడీపీ క్లారిటీ ఇవ్వనుంది.