ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై ఫైరయ్యారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.  ఏపీని దుష్ట చతుష్టయం పట్టి పీడీస్తోందని ... రాష్ట్ర ప్రజలను వైసీపీ నేత‌లు స‌మ‌స్య‌ల్లోకి నెట్టేస్తున్నార‌ని ఆయన మండిపడ్డారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జగన్ (ys jagan) ప్ర‌భుత్వంపై టీడీపీ (tdp) నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు (yanamala rama krishnudu) విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాల‌న‌లో ఏపీ రూ.7.76 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోయింద‌ని ఆరోపించారు. జగన్ మరోసారి బహిరంగ మార్కెట్‌, కార్పొరేషన్ల రుణాలను తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం క‌ట్ట‌డి చేయాల‌ని యనమల డిమాండ్ చేశారు. ఏపీలో మ‌రోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్‌కు అర్థమైందని.. అందుకే ఆయ‌న రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం గురించి ఆలోచించకుండా త‌న పార్టీ గురించే జ‌గ‌న్ ఆలోచిస్తున్నార‌ని యనమల ఫైరయ్యారు. అవినీతి సొమ్ముతో వ‌చ్చే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడాలని చూస్తున్నారని రామకృష్ణుడు ఆరోపించారు. ఏపీలో ఆదాయం లేక ప్ర‌జా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జ‌ర‌గ‌డం లేద‌ని ఆయన ధ్వజమెత్తారు. ఏపీని దుష్ట చతుష్టయం పట్టి పీడీస్తోందని ... రాష్ట్ర ప్రజలను వైసీపీ నేత‌లు స‌మ‌స్య‌ల్లోకి నెట్టేస్తున్నార‌ని మండిపడ్డారు. ప్ర‌శ్నిస్తోన్న‌ ప్రతిపక్ష నేత‌ల‌పై అక్రమ కేసులు పెడుతున్నార‌ని చెప్పారు. 

అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పొలవరం ప్రాజెక్ట్ (polavaram project) ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని 72 శాతం పూర్తి చేసిందన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం విషయంలో చేతులెత్తేసిందని... ఈ మూడేళ్లలో 3శాతం కూడా పూర్తిచేయలేకపోయిందని అన్నారు. డిసెంబర్ 2020 కల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేసి రైతుల భూముల్లో నీరు పారిస్తామన్నారు... ఏమయ్యింది జగన్? అని ఎమ్మెల్యే గోరంట్ల నిలదీసారు. 

''జగన్ చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటికొస్తున్నాయి. తన బంధువు పీటర్ చేత నిర్మాణ దర్యాప్తు చేయించడంలో అర్థంలేదు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే పోలవరం వద్ద శిలాఫలకాలు తప్ప ఏమీ లేవు. వెంటనే పనులు పూర్తిచేసి ఐదేళ్లలో 72 శాతం పూర్తిచేసాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి మళ్ళీ పోలవరం పనులను గాలికొదిలేసింది'' అని గోరంట్ల ఆరోపించారు.

''కనీసం ఇంగితజ్ఞానంలేని వ్యక్తులు మంత్రులు కావడం దౌర్భాగ్యం. ప్రాజెక్టులమీద ఏమాత్రం అవగాహన లేని మంత్రులు మీడియా మీద విరుచుకుపడుతున్నారు. జగన్ పాలనతో రాష్ట్రం సర్వనాశనమైంది. ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి'' అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. 

''పోలవరం అప్రోచ్ ఛానల్ సరిగా చేయకపోవడంతో నీరు ఆగి పోలవరానికి గండి పడింది. ఇలా పనుల్లో నాణ్యత లోపించింది. అందువల్లే నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించేందుకు బాధ్యతగల ప్రతిపక్షంగా పరిశీలించాలనుకుంటున్నాం. ఇది తెలిసే ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎందుకు నిధులు సాధించలేకపోతున్నారు? ఎందురు నాణ్యతగా పనులు చేయలేకపోతున్నారు?" అని మండిపడ్డారు.