గుంటూరు: ఏపీని చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని తపన పడ్డారని.... ఇదే ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి తాపత్రయ పడ్డారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. కానీ జగన్ ఈ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి  ఉబలాటపడుతున్నారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. 

''ఏపీలో కరోనా విశృంఖలంగా దాడి చేస్తుంటే జగన్ మద్యం అమ్మకాలు ప్రారంభించారు. మద్యం దొరికిందని జగనన్నా అని జేజేలు పలుకుతూ మందుబాబు ఆనందపడితే, అతని భార్యా, కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వాన్ని ఎంత తిట్టుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. రెండురోజుల్లో పెద్దఎత్తున మద్యం అమ్మకాలు జరిపి మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పడం కల్లబొల్లి కబుర్లు మాత్రమే. ప్రజల్లారా బహుపరాక్... జాగ్రత్తగా కరోనా విషయంలో కన్నా మద్యం అమ్మకల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి'' అని ప్రజలను హెచ్చరించారు. 

''మద్యనిషేధం విషయంలో వైకాపా ప్రభుత్వం ఆది నుంచీ తప్పటడుగులు వేస్తోంది. ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న డిస్టలరీలు ఎవరివో ప్రభుత్వం తేల్చి చెప్పాలి. ప్రభుత్వానికి నైతిక విలువలుంటే మద్యాంధ్రప్రదేశ్ గా మార్చడం లేదని ఇది ఆంధ్రప్రదేశ్ గానే ఉంటుందని భరోసా ఇవ్వగలరా సీఎం గారూ..'' అని సవాల్ విసిరారు. 

''ఊరు చక్కదనం గోడలే చెబుతాయన్నట్లు ఏడాదికాలంలో జగన్ పాలన తీరు అర్థమవుతోంది. భవిషత్తులో ఏపీని ఎలా ముందుకు తీసుకువెళుతారో సీఎం, ఆయన సలహాదార్లు సుస్పష్టం చేయాలి. వైకాపా ప్రభుత్వానికి నైతిక విలువలుంటే తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించండి. సీఐడీ  లోకల్ పోలీసులు ఎలా  విచారణ, నిజాయితీ, వ్యవహరిస్తున్నారో రాష్ట్రప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలోని కొన్ని లక్షల మంది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి పూర్తిస్థాయి విచారణ జరగాలి. సీబీఐ విచారణకు ఆదేశించి ప్రభుత్వ నిజాయితీని నిరూపించుకోవాలి'' అని కోరారు. 

''గతంలో మందుబాబులు తాగిన బ్రాండ్లు కాకుండా ఇప్పుడు కొత్తవి ఎక్కడి నుంచీ వచ్చాయి. డిస్టలరీ యాజమాన్యం వైకాపా నేతల అనుయాయులవా? మద్యం తయారీకి పబ్లిక్ టెండర్ ద్వారా అప్పగించారా? తాగుబోతుల ఆరోగ్యానికి వీలుగా ఆల్కహాలు శాతం పరీక్షిస్తున్నారా ? ప్రజారోగ్యం కాపాడే బ్రాండ్లను ఎంపిక చేశారా? లాభాల కోసం ఈ బ్రాండుల ఎంపిక చేయడం, త్వరిత గతిన అమ్ముడుపోయేలా ఉధ్వేగానికి లోనవడం పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. హానికరమైన మద్యం తాగి ప్రాణాలు కోల్పోతే  మందుబాబుల కుటుంబాలు రోడ్డున పడతాయి'' అని అన్నారు. 

''ఏపీలో మద్యం అమ్మకాలు ఎలా జరుగుతున్నాయో గమనించారా సిఎం గారూ? కరోనా లాక్ డౌన్ విరామాన్ని సావకాశంగా తీసుకుని మద్యనిషేధం విధించకుండా ఏమిటీ దురాగతం. ఉపాధ్యాయుడిని మద్యం దుకాణాల వద్ద పెడితే టీచర్ల సంఘాలు ఎక్కడున్నాయి. బతికున్నాయా? చీటికీ మాటికీ చంద్రబాబు పై గళమెత్తే ఉపాధ్యాయ నాయకులు  ఇప్పుడు దుప్పటికప్పుకుని పడుకున్నారా?'' అంటూ మండిపడ్డారు.

'' మద్యం ప్రియులందరు ఆశ పడుతున్నట్లుగా ఉత్సాహపడుతున్నారు. మద్యం షాపులను  తెరవడానికి ఈ ప్రభుత్వం ఉద్రేకానికి లోనవుతోంది.  లాక్ డౌన్ విరామాన్ని సద్వినియోగం చేసుకోడానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. మద్యం అమ్మకాలు ప్రారంభంతో  రాష్ట్రవ్యాప్తంగా మహిళలు గగ్గోలు పెడుతున్నారు,  కరోనా కట్టడి చేయండి కానీ మద్యం అమ్మకాలకు ఇది సమయం కాదని మహిళలు ఆందోళనను పెడచెవిన పెట్టడం భావ్యం కాదు. మద్యం అమ్మడమే ప్రథమమని వైకాపా  ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం అమ్మకాలు నిలిపివేస్తే వచ్చే నష్టం  రూ. 5 వేల కోట్లను  ఇంకోరకంగా పూడ్చుకోవాలి''  అని సూచించారు. 

''మద్యం మత్తులో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేశాడు... దీనికి ఎవరు బాధ్యులు. ప్రాణాలు తీస్తున్నా మద్యం నియంత్రణ చేస్తున్నామంటూ ప్రకటనలు ఇవ్వడం సరికాదు.  మద్యం షాపులు తెరవకపోతే మహిళల ప్రాణాలు పోయేవి కాదుకదా? తాగి వచ్చి భర్తలు తంతుంటే భార్యాలకు బాధలు తెలుస్తాయి .నెల్లూరులో  తొలిరోజే మత్తులో ముగ్గురు మృతి చెందారు. కరోనా ఎక్కడ సోకుతుందోనని భయపడి హడలిపోతున్న స్థితిలో మద్యం ఎలా ప్రాణాలను బలిగొంటున్నదో గుర్తించాలి. ప్రాణాలు పోతున్నా  మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఎందుకు ఉబలాటఅడుతోంది'' అని నిలదీశారు. 

''42 రోజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకులు కాపాడుకున్న ప్రజలు ఒక్కరోజులో లాక్ డౌన్ ఎత్తివేయడంతో శాంతియుత వాతావరణమంతా కొట్టుకుపోయింది.   మద్య నిషేధం వైపు నడిచే  ఆలోచన ఉన్న ప్రభుత్వమేనా? సారా నిషేధ అమలు కమిటీ సభ్యులైన లక్ష్మణరెడ్డి, రిటైర్డ్ జస్టిస్ లు భజన మాని మద్య నిషేధ అమలుకు కృషి సలపాలి'' అని అన్నారు. 

''మద్యనిషేధానికి ఆయుధంగా వాడుకోకుండా విశృంఖలంగా అమ్మకాలకు వైకాపా ప్రభుత్వం తెరదీసి ఘోరమైన తప్పు చేసింది. మద్యం అమ్మకాలు ప్రారంభించడం ప్రభుత్వం తొందరపాటు చర్య . ప్రభుత్వ మద్య విధానం మూలంగా  ఏ రకంగా మద్యాంధ్రప్రదేశ్ గా మార్చనున్నారో చెప్పాలి?  తాగి బయలు దేరిన ఇద్దరు బురదగుంటలో పడ్డారు.  రెండు బాటిళ్ళను చేతిలో పెట్టుకుని డ్యాన్సు చేస్తున్న వ్యక్తి ``రింగరింగ మాకు అంతా సంబరమే..’’అంటూ మద్యం దుకాణాల వద్ద నృత్యం చేస్తున్నాడు. ఇది ఏ విపరిణామాలకు దారి తీస్తుందో'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''మద్యం దుకాణాల వద్ద కాపలాకు  నియమించిన  టీచర్లు  ఆవేదన చెందుతున్నారని తెలిసింది. విద్యార్థులకు మద్యపానం మంచిది కాదని చెప్పాల్సిన ఉపాధ్యాయులు మద్యం దుకాణాల వద్ద క్యూలు సరిచేయాల్సిన రావడం దౌర్భాగ్యం.  మద్యం అమ్మకాలకు ఎందుకు తాపత్రయపడుతున్నారు. ఏపీకి డిస్టలరీలకు సంబంధం ఏమిటి గతంలో సరఫరా చేసిన దాఖలాలున్నాయా? మద్యం తయారీలో అనుభవముందా? ప్రజారోగ్యానికి హాని ఉండదన్న హామీ ఇచ్చేలా మద్యంపై పరీక్షలు చేయించి సర్టిఫికెట్లు తీసుకున్నారా? రాష్ట్రంలో ఎన్నడూ చూడని, వినని కొత్త బ్రాండ్లు ఏక్కడినుండి వచ్చాయి'' అని ప్రశ్నించారు. 

'' విజయోస్ బ్రాందీ, ఆక్వంటోస్ బ్రాందీ, హైదరాబాద్ బ్లూ, మంజీతా క్లాసిక్ , బుల్ ఫైటర్ ట్రిబులెక్స్, రాయల్ సీట్టైం గ్లోం, సీనియర్ ప్రొఫెసర్ రిజర్వర్, ఇండియన్ గోల్డ్ డ్రై, ఆంధ్రా తాయిస్, కోల్డ్ టచ్, ఎవర్ ప్రైస్, హెర్క్యులెస్, గెస్ట్ హౌస్, డాక్టర్స్, ఇవన్నీ ఎక్కడి నుంచీ  హఠాత్తుగా ఏపీలో ప్రవేశించాయి.  వీటి క్వాలిటీ పరీక్ష చేశారా. తాగుబోతుల ప్రాణాలకు భరోసా ఏమిటి. మద్యం షాపుల వద్ద ఏంజరుగుతోందో వేగుల వాళ్ళు చెప్పడం లేదా? సీఎం  సీఎంవో దీనిపై సమాధానం చెప్పాలి'' అన్నారు. 

''మద్యం అమ్మకాలు ప్రారంభించి కుటుంబాలను నాశనం చేయడానికి పూనుకోవడం దుర్మార్గం. ఉపాధ్యాయుల సిగ్గు సచ్చి పోతున్నారు. మద్యంఅమ్మకాలు ప్రారంభంతో ఎంతమంది పుస్తెలు తెగి మంటల్లో కాలిపోయాయో ఆలోచించండి . ఇంకెంత మంది మహిళలు పుస్తెలు  కాలి మసి కానున్నాయో చెప్పగలరా?  మద్యం షాపులు తెరవడంతొ ఎంతమంది రోడ్లపైకి వచ్చారో ప్రభుత్వానికి కనిపించిందా? కరోనాకు అడ్డుకట్ట వేయకుండా మద్యం అమ్మకాలు ప్రారంభించడం కరెక్ట్ కాదని మహిళలు నిలదీస్తున్నారు'' అని తెలిపారు. 

''మద్యం విధానంలోనే ఏదో గోల్ మాల్ జరిగింది. స్పురియస్ లిక్కర్ అమ్మకాలు  జరుపుతున్నారన్న అనుమానాలపై మద్య విధానంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలివ్వాలి. డిస్టలరీ యజమానులు ఎవరు,  ఎక్కడి నుంచి సరఫరా చేస్తూన్నారు, ఎవరి సంబంధీకులు, మద్యం అమ్మకాలకు  ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారో అంశాలన్నింటిపై  విచారణ చేయాలి.. లేకపోతే ఎంతోమంది భర్తలు మహిళల పుస్తెలు తెంచుతారని తెలుగు కుటుంబాల్లో మంటబెడతారన్నది స్పష్టం'' అని ఆరోపించారు. 

''ధరలు పెంచితే మద్యనిషేధం అమలవతుందన్న ప్రభుత్వ వాదన సరైందికాదు. ధరలు పెరిగితే భార్య మంగళసూత్రం, తెంపుకెళ్ళి, పట్టుచీర అమ్ముకుని తాగివస్తాడు. కొడుకు ఉంగరమో, ఇంట్లో సామానో తీసుకెళ్ళి అమ్ముకుని తాగివస్తాడు. ఏపీలో ముఖ్యమంత్రి సొంతజిల్లా కడపలో పంటలను అమ్మకానికి తీసుకెళుతుంటే పోలీసులు ఆడ్డుకోవడం దుర్మారగం. మద్య పాన ప్రియులపై చూపుతున్న ప్రేమ రైతుపై చూపాలి'' అంటూ వైసిపి ప్రభుత్వంపై వర్ల రామయ్య, విరుచుకుపడ్డారు.