గుంటూరు: రాష్ట్రం మొత్తం క్షేమంగా ఉంటే రాష్ట్రంలో మంత్రులు ఎక్కడున్నారు? అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు.  కరోనా కట్టడిలో బాధ్యతలు పంచుకోకుండా మంత్రులు పొరుగురాష్ట్రాల్లో తిష్టవేశారని వర్ల ఆరోపించారు. 

సోమవారం విలేకరుల సమావేశంలో  వర్ల మాట్లాడుతూ... కరోనా కట్టడి కోసం తమ  కర్తవ్య నిర్వహణను  రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఒంటెద్దు పోకడలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రానికి కీడు చేస్తోందని విమర్శించారు. చెన్నై నుంచి వచ్చిన కొత్త ఎస్ఈసి కనగరాజ్ ను క్వారంటైన్ కు పంపకపోవడంతో యావత్తు రాష్ట్రం ఉలిక్కిపడిందన్నారు. కనగరాజు కు క్వారంటైన్ విధించరా?అని నిలదీశారు. 

అస్తవ్యస్త పాలన చేస్తున్నప్పుడు, ప్రజాసంక్షేమంలో  విఫలమైనప్పుడు ప్రభుత్వానికి ప్రతిపక్షం బాధ్యతలను గుర్తు చేస్తుందని స్పష్టం చేశారు. తెదేపా చెబితేనే  నాలుగు లక్షల మంది సంక్షేమ హాస్టళ్ళ విద్యార్థుల స్థితి మెరుగు పడలేదా అని గుర్తు చేశారు. ప్రజారోగ్యం, క్షేమం కాపాడాల్సిన విద్యుద్ధర్మం ప్రభుత్వానిదని పేర్కొన్నారు. 

మాజీ ఎస్ఈసి రమేష్ కుమార్ ను అర్థాంతరంగా తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. జగన్ ఈగో దెబ్బతిన్నందుకే రమేశ్‍కుమార్‍పై సర్కారు వేటువేసిందన్నారు. ఎస్‍ఈసీకి కులం అంటగట్టారని... అధికారులకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఇదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నా స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన రమేశ్‍కుమార్‍కు ప్రజలు పాలాభిషేకం చేశారని అభినందించారు.  

ప్రపంచానిది ఒకదారి.. జగన్‍ది మరోదారి అని ఎద్దేవా చేశారు. శవాన్ని పక్కన బెట్టుకుని భోజనం చేసినట్లుంది జగన్ పాలన అని విమర్శించారు.  జగన్ మోహన్ రెడ్డి ప్రజలు అధికారం ఇచ్చారని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సాధ్యం కాదన్నారు.  దేశంలో జగన్ లా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్న సీఎం మరొకరు లేరన్నారు.ప్రజాస్వామ్యబద్ధంగా జగన్ పాలన ఉందా అని నిలదీశారు. 

రాష్ట్రంలో పాలన విస్మరించి కక్ష, ఈర్ష్య, ధ్వేషాలతో జగన్ కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పారదర్శకంగా లేని జగన్ పాలనా భాగవతం బయటపెడతామని హెచ్చరించారు. డాక్టర్లకు శానిటరీ మాస్కులు ఇవ్వకుండా  కరోన వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. రమేశ్‍కుమార్‍ను తొలగించడంలో చూపిన శ్రద్ద డాక్టర్లకు పీపీఈలు సమకూర్చడంలో చూపాలని డిమాండ్ చేశారు. రమేష్ కుమార్ పై హడావుడిగా, అవమానకరంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్, జీవోలను తక్షణం ఉపసంహరించుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.