కాపీయింగ్ లో దొరికిన వైకాపా ఎమ్మెల్యే కుమారుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళా రాష్ట్ర  అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పత్రికా ప్రకటన ఇచ్చారు. 

జగన్ అధికారంలో పవిత్రమైన వైద్య విద్య అభాసుపాలవుతోందని, డాక్టర్లను దేవుళ్లుగా కొలిచే సమాజం మనది. అలాంటి వైద్య వృత్తిలో చీడ పురుగులు చేరితే సమాజానికే అనర్థం అని ధ్వజమెత్తారు. 

గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేటు వైద్య కళాశాల నిర్వహించిన పీజీ వార్షిక పరీక్షల్లో వేమూరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున కుమారుడు బ్లూటూత్‌ తో పరీక్ష రాస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.  అయితే కాపీయింగ్‌ చేస్తున్నట్లు కేసు బుక్‌ చేసినా ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా క్లీన్ చీట్ ఇచ్చేందుకు వెనకాడకపోవడం వైసీపీ దురాగతాలకు నిదర్శనం అని మండిపడ్డారు.

వైద్య విద్యను బోధించే ఉపాధ్యాయులపై జగన్ ప్రభుత్వం బెదిరించటం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడటం జగన్ పార్టీ డీఎన్ఏలోనే ఉందన్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే కాపీయింగ్ కు పాల్పడి పట్టుబడ్డారని సంచలన వ్యాఖ్య చేశారు. 

వైసీపీ ఎమ్మెల్యేల కొడుకులు కూడా జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని పరీక్షల్లో కాపీ కొడుతున్నారని,  అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైద్య విద్యను బ్రష్టుపట్టించాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించటం హేయం అని చెప్పుకొచ్చారు. 

పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడిన ఎమ్మెల్యే కొడుకుకు శిక్ష వేయకుండా వైసీపీ నాయకులే అడ్డుపడటం పవిత్రమైన వైద్య విద్యకు కళంకం. ఇటువంటి దురాగతాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే జగన్ దుర్మార్గపు చర్యలతో విద్యా వ్యవస్థను నీరుగారుస్తున్నారు. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు స్పందించటం లేదు? వాస్తవాలను ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? విద్యార్దులకు జగన్ రెడ్డి ఏం సంకేతం ఇవ్వాలనుకుంటారు? అని ప్రశ్నించారు.