Asianet News TeluguAsianet News Telugu

కాకాణి పుణ్యమా అని సీబీఐ విచారణ ఎదుర్కొన్నా : టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరులోని 4వ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగిన మెటీరియల్ చోరీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి సోమిరెడ్డిని ఇవాళ మరోసారి విచారణకు హాజరయ్యారు. 

tdp leader somireddy chandramohan reddy slams minister kakani govardhan reddy
Author
First Published Jan 11, 2023, 7:41 PM IST

సీబీఐ అధికారులు తనను మరోసారి ప్రశ్నించారని తెలిపారు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా వారికి 9 డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌ను అందజేసినట్లు చెప్పారు. కాకాణి పుణ్యమా అని సీబీఐ ఎదుట హాజరు కావాల్సి వచ్చిందని సోమిరెడ్డి అన్నారు. మరో వారం తర్వాత మళ్లీ విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పారని చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉన్న కేసుకు సంబంధించి నెల్లూరులోని 4వ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగిన మెటీరియల్ చోరీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదుదారు, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుంచి పలు వివరాలను సేకరించారు. తాజాగా బుధవారం మరోసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుంచి సీబీఐ అధికారులు విచారించారు. గతవారం సీబీఐ అధికారుల విచారణ అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు నిర్మలాదేవి, అనంతకృష్ణన్‌లు తనను గంటన్నరకు పైగా విచారించారని చెప్పారు. వచ్చే వారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారని చెప్పారు. సీబీఐ తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని సోమిరెడ్డి పేర్కొన్నారు.

ALso REad: నెల్లూరు కోర్టులో చోరీ కేసు: మరోసారి మాజీ మంత్రి సోమిరెడ్డి నుంచి వివరాలు సేకరిస్తున్న సీబీఐ..

అసలు వివాదం విషయానికి వస్తే.. మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపరిచారు. అయితే 2022 ఏప్రిల్ 14న ఈ కేసులో కోర్టుకు సమర్పించిన మెటీరియల్ చోరీకి గురైంది. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారించిన హైకోర్టు.. విచారణను సీబీఐకి అప్పగించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios