Asianet News TeluguAsianet News Telugu

న్యాయ కోవిదుడైన గవర్నర్ చేత అబద్ధాలు.. ప్రసంగంలో రాజధాని అంశమేది : సర్కార్‌పై పయ్యావుల ఫైర్

గవర్నర్ ప్రసంగంపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. న్యాయ కోవిదుడైన గవర్నర్ చేత రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని పయ్యావుల కేశవ్ దుయ్యబట్టారు.గవర్నర్‌తో సీఎంని పొగిడించటమేంటని పయ్యావుల కేశవ్ నిలదీశారు.

tdp leader payyavula keshav slams ysrcp govt over 3 capitals issue
Author
First Published Mar 14, 2023, 3:09 PM IST

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే మధ్యలోనే టీడీపీ సభ్యులు సభను వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. గవర్నర్‌తో సీఎంని పొగిడించటమేంటని పయ్యావుల కేశవ్ నిలదీశారు. అలా చేసి ఆయన స్థాయిని తగ్గించారంటూ చురకలంటించారు. అలాగే శాంతి భద్రతల అంశం ఎక్కడా ప్రస్తావించలేదని.. న్యాయ కోవిదుడైన గవర్నర్ చేత రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని పయ్యావుల కేశవ్ దుయ్యబట్టారు. 

అటు టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. విభజన చట్టం కాలపరిమితి ముగుస్తున్నా దానిని ఎక్కడా ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ఈసారి కూడా పూర్తికావడం కష్టమేనని గవర్నర్‌తో చెప్పించారని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పలేక గవర్నర్ కూడా పలుమార్లు ఇబ్బంది పడ్డారని నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. 

Also REad: తొమ్మిది రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 16వ తేదీన సభలో బడ్జెట్.. బీఏసీలో నిర్ణయం..

కాగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే.. శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. ఆ తర్వాత శాసనసభ స్పీకర్ తమ్మినేని ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో 9 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. అలాగే 16వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.  ఇక, అసెంబ్లీలో రేపు(బుధవారం) గవర్నర్ ప్రసంగంపై తీర్మానం ఉంటుందని చీఫ్ విప్ ప్రసాదరాజు తెలిపారు. ఈ శని, ఆది వారాల్లో (18,19 తేదీల్లో) కూడా సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ నెల 21,22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించినట్టుగా చెప్పారు. మరోవైపు అసెంబ్లీ  బడ్జెట్ సమావేశాల్లో 20 అంశాలపై చర్చించాలని కోరినట్టుగా అచ్చెన్నాయుడు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios