వ్యూహాత్మకంగా లోకేష్.. రేపు తల్లితో కలిసి ఢిల్లీకి, ఏపీలో పరిస్ధితులపై జాతీయ మీడియాకు ప్రజేంటేషన్..?
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని శుక్రవారం ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలో మీడియాకు వివరించాలని నారా లోకేష్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. మరోవైపు ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జైలులో బాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నడుస్తాయని పవన్ కీలక ప్రకటన చేయడంతో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.
ఇదిలావుండగా.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని శుక్రవారం ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలో మీడియాకు వివరించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు ప్రకటనలు చేశారు. జాతీయ మీడియా సైతం ఈ ఇష్యూపై మంచి కవరేజ్ ఇస్తోంది.. దీంతో ఏపీలో ప్రస్తుత పరిణామాలు, ఇతర అంశాలపై ప్రజేంటేషన్ ఇవ్వాలని నారా లోకేష్ భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపై కేసులు పెడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు దేశంలో ఎక్కడా జరిగి ఉండవని.. వాటన్నింటినీ మీడియాకు వివరించాలని లోకేష్ యోచన . గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా పెట్టకపోవడాన్ని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు చేసి.. తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వంటి వాటిని.. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిన పరిస్థితుల్ని జాతీయ స్థాయిలో హైలెట్ చేయాలని లోకేష్ వ్యూహంగా తెలుస్తోంది.
ALso Read: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్.. ఆ తర్వాతే విచారణ తేదీపై క్లారిటీ..!
అదే సమయంలో ఆధారాలు లేని కేసుల్ని ప్రతిపక్ష నేతలపై మోపుతున్నది కూడా ఆయన వివరించే అవకాశాలు వున్నాయి. వ్యాపార సంస్థలపై ప్రభుత్వం జరిపిన దాడులు, అమరరాజా వంటి దేశానికి ప్రాముఖ్యత తెచ్చిన సంస్థలపై జరిగిన దాడుల గురించీ లోకేష్ ప్రజేంటేషన్ ఇస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 73 ఏళ్ల వయసులో ఉన్నచంద్రబాబును 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్‌లో లేనప్పటికీ అరెస్ట్ చేసిన విషయాన్ని లోకేష్ తెలియజేస్తారని సమాచారం. కనీసం గవర్నర్ అనుమతి లేకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టే అవకాశం ఉంది.
మరోవైపు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నారా లోకేష్ కలుస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి స్పష్టతా లేదు. లోకేష్ వెంట తల్లి భువనేశ్వరి కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం వుందని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. లోకేష్ ఢిల్లీ పర్యటనపై అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి వుంది.