ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: లోకేష్ సన్నిహితుడు రాజేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కిలారు రాజేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై శుక్రవారంనాడు ఏపీ హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్టులో కిలారు రాజేష్ పేరును సీఐడీ అధికారులు ప్రస్తావించారు. రాజేష్ పరారీలో ఉన్నారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజేష్ కీలకంగా వ్యవహరించారని సీఐడీ ఆరోపిస్తుంది. రాజేష్ ను విచారిస్తే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సీఐడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇదే సమయంలో ఏపీ హైకోర్టులో రాజేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కిలారు రాజేష్ కు ఏపీ సీఐడీ అధికారులు 41 ఏ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.
also read:ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీవారంట్‌కు ఆమోదం: చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలన్న జడ్జి
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 9న టీడీపీ చీఫ్ చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నాడు. రాజేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్ పీ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో ఇవాళ సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు విన్పించే అవకాశం ఉంది.