ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు.. ఇప్పటి పనులకు క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు (electricity charges) పెంచుతూ ఈఆర్సీ ప్రకటించడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ వ్యవహారంపై టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ (nara lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బాదుడంటూ నాడు జగన్‌ తీసిన దీర్ఘాల స్థాయిలోనే మూడేళ్లలో విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెంచి జనానికి షాక్‌ కొట్టించారని వ్యాఖ్యానించారు. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చి సామాన్యులపై జగన్‌ సర్కార్‌ (ys jagan) మరో పిడుగు వేసిందని నారా లోకేష్ ధ్వజమెత్తారు. 

ఒక ఏడాదిలో జగన్‌ రెడ్డి ఇచ్చే అన్ని పథకాల డబ్బు.. ఏడాది కరెంట్‌ బిల్లులకే సరిపోనంత స్థాయిలో పెరగనుండటం ఏం బాదుడో సీఎం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉచిత విద్యుత్‌ ఇస్తుంటే అపోహలు సృష్టించడం, 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తే ఇవ్వలేదని చెప్పిన అబద్ధాలపైనా, కరెంటు ఛార్జీలు పెంచకపోయినా బాదుడే బాదుడంటూ తప్పుడు ఆరోపణలు చేయడంపైనా జగన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఉచిత విద్యుత్‌పై మాట తప్పి మోటార్లకు మీటర్లు బిగించినందుకు, కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపినందుకు, లోటు విద్యుత్‌ స్థాయికి దిగజార్చి కొరతతో కోతలు అమలు చేస్తున్నందుకు, ఏపీ విద్యుత్‌ రంగాన్ని జగన్‌ రెడ్డి తన విధ్వంసకర విధానాలతో సంక్షోభంలో పడేసినందుకు రాష్ట్ర ప్రజల్ని మన్నించమని ప్రాథేయపడాలని నారా లోకేష్ అన్నారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలకు వేసవి షాక్‌ ఇచ్చిన జగన్‌ రెడ్డి ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ రెడ్డి మాట ఇస్తే దానికి రివర్స్‌ చేస్తారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. 

కాగా.. Andhra Pradesh లో power charges పెంచిన సంగతి తెలిసిందే. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 76-125 యూనిట్ల వరకు యూనిట్ కు రూ.1.40 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 126-225 యూనిట్ కు రూ. 1.57 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. 

226 నుండి 400 యూనిట్లకు యూనిట్ కు రూ. 1.16 పెంచారు. 400 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారిపై రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. కేటగిరిలను రద్దు చేసి ఆరు స్లాబ్ లను తీసుకొచ్చినట్టుగా ఏపీ ఈఆర్‌సీ చైర్మెన్ ప్రకటించారు. 2016-17 లో యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 5.33 ఖర్చు అయిందని 2020-21 నాటికి యూనిట్ విద్యుత్ ఖర్చు రూ. 6.87కి పెరిగిందని ఈఆర్‌సీకి ఏపీ విద్యుత్ శాఖకు చెందిన డిస్కం కంపెనీలు వివరించాయి.

పెరిగిన విద్యుత్ ఖర్చుల మేరకు చార్జీల పెంపును అంగీకరించాలని డిస్కంలు ఈఆర్‌సీని కోరాయి. దీంతో డిస్కంలకు విద్యుత్ చార్జీలను పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చినట్టుగా ఈఆర్‌సీ చైర్మెన్ నాగార్జున రెడ్డి వివరించారు. ఇప్పటికే తెలంగాణలో కూడా విద్యుత్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. యూనిట్ కు 50 పైసల నుండి రూ. 2 ల వరకు చార్జీలను పెంచారు. విద్యుత్ ఛార్జీల పెంపును విపక్షాలు తీవ్రంగా తప్పు బడుతున్నాయి. 125 నుండి 225 యూనిట్ విద్యుత్ ను వినియోగించే వినియోగదారులు ఎక్కువగా రాష్ట్రంలో ఉంటారు. 

వీరిపై భారం మోపారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుతో రూ. 4,400 కోట్ల భారం వినియోగదారులపై పడనుంది. కోటి 70 లక్ష మందిపై విద్యత్ చార్జీల భారాన్ని డిస్కంలు మోపాయి..వివిధ కేటగిరిల కింద రూ. 1400 కోట్ల భారం పడనుంది. 75 యూనిట్ల లోపు వాడే వినియోగదారులు రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది ఉంటారు.మూడేళ్లలో ట్రూప్ అప్ చార్జీల పేరుతో రూ. 3 వేల కోట్ల వసూలుకు ఈఆర్సీ అనుమతిని ఇచ్చింది.2014 నుండి 2019 వరకు సర్ధుబాటు చార్జీల పేరుతో వసూళ్లు చేశాయి డిస్కం సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త టారీఫ్ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది ఆగష్టు నుండి ట్రూఆప్ చార్జీలను వసూలు చేయనున్నారు.