పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా పడటం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఫలితాలను వాయిదా వేసింది మంత్రి అలిగారనా? లేదా ఫలితాల్లో జగన్ మార్క్ మార్కుల మార్పుల కోసమా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. విద్యార్ధుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలను (ap ssc results 2022) వాయిదా వేయడం పట్ల టీడీపీ (tdp) ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ (nara lokesh) మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోందని, తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందని ఆయన ఫైరయ్యారు. పదో తరగతి ఫలితాలను కూడా రాజకీయం చేశారంటూ నారా లోకేష్ ఆరోపణలు గుప్పించారు. మంత్రికి సమాచారం ఇవ్వకుండా అధికారులు ఫలితాల తేదీని ప్రకటించారన్న కారణంగా ఫలితాలను అకస్మాత్తుగా వాయిదా వేస్తారా? అని ఆయన నిలదీశారు. ఫలితాలను వాయిదా వేసింది మంత్రి అలిగారనా? లేదా ఫలితాల్లో జగన్ మార్క్ మార్కుల మార్పుల కోసమా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఇంత దరిద్ర, అరాచక పాలనను చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు.
కాగా.. ఈరోజు ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సమయం గడిచినా కూడా అధికారులు మాత్రం మీడియా సమావేశానికి హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఫలితాల విడుదల వాయిదా పడినట్టుగా అధికారులు సమాచారం ఇచ్చారు. ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. అయితే సోమవారం (జూన్ 6) ఏ సమాయానికి ఫలితాలు విడుదల చేస్తారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదల వాయిదా వేశామని అధికారులు చెబుతున్నారు.
Also Read:AP SSC Result 2022: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల వాయిదా.. పూర్తి వివరాలు ఇవే..
ఈ ఏడాది ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. మరోవైపు.. ఫలితాల తరువాత విద్యాసంస్థలు ర్యాంకులకు ప్రకటనల రూపంలో ఇవ్వడంపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే.. జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించింది. మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.
