కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ నేత నందం సుబ్బయ్య కుటుంబాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. అనంతరం సుబ్బయ్య మృతదేహం వద్ద లోకేశ్ ధర్నాకు దిగారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే, ఆయన బావమరిది, మున్సిపల్‌ కమిషనర్ల పేర్లను చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకా రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగాయని లోకేశ్ ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. ఒక్క వీడియోకు వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని లోకేశ్ ప్రశ్నించారు. 

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత సుబ్బయ్య దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద గుర్తు తెలియని దుండగులు ఆయనను కిరాతకంగా నరికి చంపారు.

మారణాయుధాలతో దాడి చేయడంతో సుబ్బయ్య తల ఛిద్రమైంది. అయితే రాజకీయ కోణంలోనే ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుబ్బయ్య హత్య వెనుక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌ రెడ్డి, ఆయన బావమరిది ఉన్నారని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపిస్తున్నారు.