చంద్రబాబు అరెస్ట్ : ‘‘న్యాయానికి సంకెళ్లు’’ అంటూ వినూత్న నిరసనకు నారా లోకేష్ పిలుపు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ‘‘న్యాయానికి సంకెళ్లు’’ పేరిట తెలుగుదేశం పార్టీ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రేపు (ఆదివారం) రాత్రి 7 గంటలకు చేతులకు తాడు, రిబ్బను కట్టుకొని నిరసన తెలపాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు గడిచిన కొన్నిరోజులుగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి వంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా ‘‘న్యాయానికి సంకెళ్లు’’ పేరిట తెలుగుదేశం పార్టీ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
రేపు (ఆదివారం) రాత్రి 7 గంటలకు చేతులకు తాడు, రిబ్బను కట్టుకొని నిరసన తెలపాలని ఆయన సూచించారు. ఆ సమయంలో న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని నినదించాలని లోకేష్ పిలుపునిచ్చారు. నిరసన తెలిపిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని ఆయన కోరారు. ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
మరోవైపు.. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు నివేదిక వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. చంద్రబాబు చేతులు, ముఖంతో పాటు కొన్ని శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ ఉన్నట్టుగా వైద్యులు నిర్దారించారు.
అంతేకాకుండా తీవ్రమైన ఎండల వల్ల డీహైడ్రేషన్‌తో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. డీహైడ్రేషన్ వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పలు రకాల మందులను కూడా సిఫార్సు చేశారు. ఈ మేరకు జి సూర్యనారాయణ,వి సునీతాదేవీలతో కూడిన వైద్యుల బృందం జైలు అధికారులకు నివేదికను అందజేసింది.
అయితే చంద్రబాబు కి హైపర్ ట్రోఫీక్ కార్డియో మైయోపతి సమస్య ఉందని ఆయన వ్యక్తి గత వైద్యులు పేర్కొంటున్నారు.ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్ తో గుండె పైనా ప్రభావ పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం, అధికారులు చిన్నవి చేసి చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నట్టుగా పేర్కొన్నారు. ఇక, చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ను బటయపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుందని జైలు అధికారులు చెప్పుకొచ్చారని.. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఉందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.