Asianet News TeluguAsianet News Telugu

దళిత యువకుడిది హత్యే... మృతుడి తల్లిదండ్రులనూ చంపుతానంటూ ఎమ్మెల్సీ బెదిరింపులు: టిడిపి ఆనంద్ సాగర్

అధికార వైఎస్సార్ సిపి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ కారులో అతడి డ్రైవర్ మృతదేహం ఘటనపై టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ స్పందించారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యంది యాక్సిడెంట్ కాదు ముమ్మాటికీ హత్యేనని ఆయన ఆరోపించారు. 

TDP Leader moka anand agar react dead body found in MLC anantha uday bhaska car
Author
Amaravati, First Published May 20, 2022, 1:49 PM IST

అమరావతి: దళిత యువకున్ని అతి దారుణంగా కొట్టిచంపిన వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అధికార అండతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ ఆరోపించారు. తనవద్ద కారు డ్రైవర్ గా 5 సంవత్సరాలు పనిచేసిన దళిత యువకుడు వీధి సుబ్రమణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. శవాన్ని స్వయంగా ఎమ్మెల్సీయే కారులో తీసుకొచ్చి మృతుడి నివాసంవద్ద పెట్టి వేరే కారులో పరారయ్యాడని... తనపై ఎలాంటి కేసు లేకుండా చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆనంద్ సాగర్ ఆరోపించారు. 

ఎమ్మెల్సీ చేతిలో దళిత యువకుడి హత్యను తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దళితుల పట్ల చిత్తశుద్ధి లేదని...వుంటే ఇలాంటి దారుణాలు జరగవన్నారు. వైసిపి అధికారంలోని వచ్చిన ఈ మూడేళ్లలో దాదాపు 1600 మంది దళిత మహిళలపై, యువకులపై  దాడులు, హత్యాకాండలు, అఘాయిత్యాలు జరిగాయని... ఇంకా యదేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. వెలుగులోకి కొన్ని రాగా, రానివి ఇంకెన్నో'' అని అనంద్ సాగర్ పేర్కొన్నారు. 

Video

''జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దళితులపైన దాడులు, హత్యాకాండలు అధికమయ్యాయి. ఇవన్నీ వైసీపీ నాయకులే చేయిస్తున్నారని పలు ఆధారాలున్నాయి. ఈ కోవకు చెందినదే నేడు తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన దారుణం'' అని అన్నారు. 

''వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ తనవద్ద పనిచేసే డ్రైవర్ ని హత్య చేసి స్వయంగా ఆయనే కారు వెనుక సీట్లో పడుకోబెట్టుకొని మృతుడి ఇంటికి తీసుకెళ్లాడు. ఇలా హత్యను ఆక్సిడెంట్ గా చిత్రీకరించి మృతుడి తల్లిదండ్రులను నమ్మించడానికి ప్రయత్నించాడు. వారిని బెదిరించడం కూడా జరిగింది. శవాన్ని తీసుకోకపోతే వారిని కూడా చంపుతానని బెదిరించాడు'' అని తెలిపారు. 

''మ‌ృతుడి కుటుంబసభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో ఎమ్మెల్సీ అక్కడ నుంచి మరో కారులో పరారయ్యాడు. ఈ విధానం చూస్తుంటే అతనే ఆ హత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. తక్షణమే ఉదయబాబుని అరెస్టు చేయాలి. హత్య కేసు నమోదు చేయాలి. సీబీఐ ఎంక్వైరీ వేయాలి. ఉదయభాస్కర్ ను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి. ఇతన్ని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకొని మృతుడి కుటుంబీకులకు తగిన న్యాయం చేయాలి'' అని ఆనంద్ సాగర్ డిమాండ్ చేసారు. 

ఇక దళిత యువకుు సుబ్రహ్మణ్యం మృతిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు.  గతంలో శాంతిభద్రతలు అదుపులో వుండి ఎంతో ప్రశాంతమైన ఆంధ్ర ప్రదేశ్ వైసిపి అధికారంలో వచ్చాక బిహార్ కంటే దారుణంగా తయారయ్యిందన్నారు. వైసిపి మాఫియా, వైసిపి నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. 

''తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోంది. ఎమ్మెల్సీ అనంత బాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయినా అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు'' అని లోకేష్ నిలదీసారు. 

''వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? సుబ్రహ్మణ్యంని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలి. హత్యపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios