అవినీతి పరుడు, వెన్నుపోటు దారుడు, ద్రోహికి పుట్టిన లోకేష్ స్థాయి తనది కాదంటూ వైసిపి నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఘాటుగా స్పందించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని నోటికి వచ్చినట్లు తిడితే మంత్రి పదవి వస్తుందేమో కానీ కుసంస్కారం బయటపడుతుందని కాకాని గుర్తిస్తే మంచిదని జవహర్ హెచ్చరించారు. 

''కాకాని... నోరు అదుపులో పెట్టుకో... నువ్వే ఓ 420వి, మీ నాయకుడు అంతర్జాతీయ నేరస్తుడు. నిన్ను నీవు ఎక్కువగా ఊహించికుంటున్నావు. నీలాంటి వారిని వెధవ, సన్నాసి, లుచ్ఛా, లంగా, లఫంగి అనే పదాలతో తిట్టాలని వుంది... కాని మాకు సంస్కారం అడ్డువస్తుంది'' అంటూ తీవ్ర పదజాలంతో తిట్టను అంటూనే తిట్టారు. 

''కుక్క మనల్ని కరిచిందని కుక్కని మనం కరవలేముగా అని మా నాయకుడు చెప్పే మాటలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. నిన్ను... నీ భాషను నీ సంస్కారానికి వదిలేస్తున్నా'' అంటూ కాకానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జవహర్. 

తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా వైసిపి ప్రభుత్వం, పార్టీపై తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారాలు చేశారని కాకాని ఆరోపించారు. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని మత్స్యకారులకు తమ హయాంలో రూ.45కోట్లు విడుదల చేశామని చెప్పుకున్నారని... అదంతా అవాస్తమన్నారు. ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడలేదని చంద్రబాబు కానీ ఆయన తనయుడు లోకేష్ గానీ తిరుమలలో ప్రమాణం చేయగలరా..? అంటూ కాకాని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలకే తాజాగా జవహర్ కౌంటరిచ్చారు.