గుంటూరు: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర చరిత్రను దిగజారుస్తున్నారని... ఆయన పాలనను వదిలి పగకే ప్రాధాన్యమిస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కెఎస్ జవహర్ ఆరోపించారు. 

''కేవలం కోర్టు వ్యాఖ్యకు నైతిక బాధ్యతగా నీలం సంజీవ రెడ్డి రాజీనామా చేసి చరిత్రలో నిలిచిపోయారు. తెలుగువారికంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి అన్న ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. హైటెక్ సిటీ నిర్మాణంతో తెలుగు వారి చరిత్రకు చంద్రబాబు నూతనోత్తేజం తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదికి చరిత్రను నాశనం చేశారు.నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''పెట్టుబడి దారులకు రుణాలివ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేసేలా చేశారు. ప్రధాని, హోం మంత్రి ఒక ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఎవరు ఏ శాఖకు మంత్రో తెలియని పరిస్థితి బహుశా ఇప్పుడే చూస్తున్నాం'' అన్నారు. 

''మూడు రాజధానుల ప్రకటన నుండి పారాసిటమాల్, కరోనా పుట్టుక వరకు జగన్ ను ప్రజలు ట్రోల్ చేస్తున్నారు. రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి జగన్ దిగజారిపోయారు. ముఖ్యమంత్రిగా ఉంటూ కోర్టు మెట్లు ఎక్కి రాష్ట్ర చరిత్రకు నల్ల రంగు పులిమారు. రాష్ట్రంలో పాలన జారుడుబల్ల కన్నా వేగంగా జార్చేశారు'' అని విమర్శించారు. 

''బీహార్ ను తలదన్నేలా ఏపీ అభివృద్ధిలో వెనక్కి నడిపించారు. శాంతి భద్రతలు ఛిద్రం చేశారు. కరోనా సమయంలో మద్యం షాపుల్ని తెరిచి కరోనా వ్యాప్తి చేశారు. మద్యం షాపుల వద్ద ఉపాధ్యాయులను నిలబెట్టి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు. ఏడాదిలోనే రూ.87వేల కోట్లు అప్పు చేసి రికార్డుల్లోకి ఎక్కారు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం వంద తప్పులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రగతిని, ప్రతిష్టను కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోనుంచి దిగిపోవాలి'' అని డిమాండ్ చేశారు.