గుంటూరు: వైసిపి ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులతో చివరకు రాజ్యాంగ పదవిలో వున్న అసెంబ్లీ స్పీకర్ కూడా న్యాయ వ్యవస్థను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. ఇలాంటి  వ్యాఖ్యలను మానుకోవాలని  ఇటీవలే మైకోర్టు వారికి మొట్టికాయలు వేసినా మారడం లేదని టిడిపి నాయకులు మండిపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కేఎస్ జవహర్ కూడా న్యాయవ్యవస్థపై వైసిపి అసహనాన్ని ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు.

''అతి పెద్ద ఆర్ధిక కుంభకోణం లో నిందితునిగా ఉండి పది సీబీఐ కేసుల్లో మొదటి ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డికి కోర్టులో బెయిల్ వచ్చిన రోజు మేం కోర్టులను, న్యాయ మూర్తులను తప్పు పట్టలేదు. ఆ బెయిల్ ఆధారంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మేం న్యాయ వ్యవస్థలో లోపాలు ఎంచలేదు'' అంటూ జవహర్ ట్వీట్ చేశారు.

''సీబీఐ కోర్టుకు వారం వారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన పని లేకుండా ఆయనకు కోర్టులు మినహాయింపు ఇచ్చినప్పుడు కూడా మేం కోర్ట్ తీర్పులను గౌరవించాం తప్ప న్యాయ మూర్తులను తప్పు పట్టలేదు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి ఎందుకో తొందర పడుతున్నట్లున్నారు. కేసుల భయం వివేకాన్ని చంపేస్తోందా?'' అంటూ వరుస ట్వీట్ల ద్వారా మాజీ మంత్రి మండిపడ్డారు.