Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ప్రభుత్వం తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకం: కొల్లు రవీంద్ర ఫైర్

గత  ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు 10 వేల మెగావాట్ల విద్యుత్ లోటును కేవలం 100 రోజుల్లోనే అధిగమించారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు.   

TDP Leader Kollu Ravindra Fires on YCP Govt
Author
Guntur, First Published May 15, 2020, 8:18 PM IST

గుంటూరు: పిట్టకథలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విద్యుత్ పై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కొల్లు రవీంద్ర  తెలియజేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో ఏనాడు విద్యుత్ బిల్లులు పెంచలేదని... అంతేకాకుండా 2019లో మరలా తిరిగి అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని కూడా చెప్పారని గుర్తుచేశారు. 

''2014లో చంద్రబాబు నాయుడు అధికారం లోకి వచ్చేనాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉన్నది. నాడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 9,529 మెగావాట్లు మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు 10 వేల మెగావాట్ల విద్యుత్ లోటును 100 రోజుల్లోనే అధిగమించారు. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ రంగంలో రూ.36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 13 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు'' అని రవీంద్ర తెలిపారు.

''బుగ్గన విద్యుత్ బిల్లుల పెరుగుదలపై అన్నీ కాకి లెక్కలు చెప్పారు. స్లాబ్ లు, కేటగిరీలు మార్చేసి విద్యుత్ బిల్లులు పెంచి సామాన్యుడిపై భారం మోపడమే కాకుండా లెక్కల గారడీలతో వారిని మోసం చేయాలని చూస్తున్నారు. బిల్లుల పెరుగుదలపై సామాన్యులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఒక పత్రికపై కక్షతో నిందలు వేసే ప్రయత్నం చేశారు'' అని మండిపడ్డారు. 

''విద్యుత్ బిల్లులు లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నేడు వైసీపీ ప్రభుత్వం మార్చి-ఏప్రిల్ లకు కలిపి వేల రూపాయలు బిల్లులు వేసిన మాట వాస్తవం కాదా? ఒకవైపు ఫ్రీ అని చెబుతూ మరోవైపు బిల్లులు కట్టమని చెబుతున్న ప్రభుత్వం మరెక్కడా ఉండదు. విద్యుత్ బిల్లులు పెరిగాయని చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు తెలిసిన విషయం బుగ్గన కు తెలియదా?'' అని ప్రశ్నించారు.

''అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా ఒక్క కొత్త యూనిట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయని వైసీపీ ప్రభుత్వానికి విద్యుత్ గురించి మాట్లాడే అర్హత ఉందా? పీపీఏలపై సమీక్షలో సౌర పవన విద్యుత్తు నిలుపుదల చేయడంతో  ఇప్పుడు ఎక్కువ చెల్లించి విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నామని ఎనర్జీ సెక్రెటరీ చెప్పలేదా? రూ 4.84 పైసలకు వస్తున్న పవన విద్యుత్తు కాదని మీ మూర్ఖత్వంతో ఆరు రూపాయలు పెట్టి పక్క రాష్ట్రాల నుంచి థర్మల్ విద్యుత్ కొనుగోలు చేసింది మీరు కాదా?'' అంటూ నిలదీశారు.

''గత టిడిపి ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ 26,000 కోట్ల రూపాయలు రుణం చేస్తే జగన్ ప్రభుత్వం 11 నెలల్లో 81 వేల కోట్లు రుణం చేయలేదని బుగ్గన చెప్పగలరా? ఇప్పుడు దానిని అనుభవిస్తూ ఆయన పైనే విమర్శలు చేయడానికి మీది నోరా లేక తాటి మట్టా? అని ప్రశ్నించారు.పక్క రాష్ట్రాలతో సహా దేశం మొత్తం చంద్రబాబు నాయుడు విద్యుత్  విధానాలను మెచ్చుకుంటుంటే దానిని అనుభవిస్తున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దినట్లు వ్యవహరిస్తుందని'' కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios