అమరావతి: రాష్ట్రంలోని మత్స్యకారులకు కోసం ఎన్నడూ జరగని విధంగా సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాత్రమేనని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతి కోసం గతంలో బియ్యం మాత్రమే ఇచ్చేవారని... కానీ వారికి రూ.4000 ఆర్ధిక సాయాన్ని అందించడాన్ని ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలిపారు. కానీ నేడు వైసిపి ప్రభుత్వం తామే దీన్ని మొదటిసారి ప్రారంభించినట్లు హడావుడి చేస్తున్నారని రవీంద్ర మండిపడ్డారు. 

''గృహ నిర్మాణంలో మత్స్యకారులకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించాం. 2014కి ముందు నాలుగు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే.. మరో ఆరు కొత్తగా ప్రారంభించాం. వేటకు వాడే బోట్లకు ఆయిల్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 75 శాతం సబ్సిడీతో పడవలు, వలలు, బైకులు అందించాం. 50 శాతం సబ్సిడీతో ఐస్ బాక్సులు అందించాం. మత్స్యకారులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే'' అని తెలిపారు. 

''హుధూద్ తుపానుతో పడవలు దెబ్బతిన్న మత్స్యకారులకు రూ.6లక్షల వ్యయంతో పడవలు అందించాం. తుపాన్లతో నష్టపోయిన మత్స్యకారులకు పడవలు, వలలు, ఇతర పరికరాలు, నిత్యావసర సరుకులు ఉచితంగా ఇచ్చాం.గత సంవత్సర కాలంగా ఒక్క పడవగానీ, వలగానీ, కనీసం ఐస్ బాక్సు కూడా అందించిన ఘనత లేదు. నవరత్నాల పేరుతో హడావుడి చేస్తూ.. వాటిలో ఏ పథకమైనా పొందితే వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి అందదు అని ప్రకటించడం దుర్మార్గం కాదా.?'' అని ప్రశ్నించారు. 

''సబ్సిడీల్లేవు, బ్యాంకు రుణాల్లేవు. ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ లేదు. ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా ఒక కుటుంబానికే ఇస్తామని చెప్పడం సరికాదు. తీరానికి రక్షణగా నిలిచే మడ అడవుల్ని వైసీపీ నేతలు ఇష్టానుసారంగా నరికి వేస్తూ ఆక్రమిస్తున్నారు. జగన్ తన స్వార్ధం కోసం తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని గతంలో గంగవరం, కాకరాపల్లిలో ఐదుగురు మత్స్యకారుల ప్రాణాలు బలిగొన్నారు. బీచ్ శాండ్ పేరుతో రాష్ట్ర తీరం మొత్తాన్ని కొల్లగొట్టారు'' అని ఆరోపించారు. 

''బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను కుట్రపూరితంగా 24శాతానికి కుదించారు. బీసీ కార్పొరేషన్ నిధుల నుండి నవరత్నాలకు మళ్లిస్తున్నారు. కొత్త స్కీం పెడితే బడ్జెట్లో నిధులు లేకుంటే ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ నుండి అనుమతి తెచ్చుకుని సర్దుబాటు చేసుకునే వారు. అలా కాకుండా జీవో నెం.6 ద్వారా రూ.3432 కోట్లను అమ్మ ఒడికి, జీవో నెం.1243 ద్వారా రూ.202 కోట్లు వసతి దీవెనకు మళ్లించారు'' అని తెలిపారు. 

''బీసీలకు ఇవ్వాల్సిన రూ.4000 కోట్ల రుణాలు ఏమయ్యాయి.? 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే సంవత్సరకాలంగా ఎందుకు నాన్చుతున్నారు.? బీసీలకు ఇవ్వాల్సిన వాహనాలు ఏమయ్యాయి.? రూ.972 కోట్ల విలువైన ఆదరణ-2 పనిముట్లు ఎందుకు బీసీలకు పంచడం లేదు.? 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు అన్నారు. ఏమయ్యాయి.? ఎన్నికల మేనిఫెస్టోకు ప్రస్తుతం చేస్తున్న పనులకు ఏమైనా సంబంధం ఉందా.? ఈ విషయంలో బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు.? ప్రశ్నించే బీసీలపై దాడులు చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో బీసీల నుండి 4వేల అసైన్డ్ భూముల్ని లాక్కున్నారు.  ఇది ద్రోహం కాదా.?'' అంటూ నిలదీశారు. 

''నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం అన్నారు. కానీ అన్ని పదవులు సొంత సామాజికవర్గానికే కట్టబెట్టారు. యూనివర్శిటీ వీసీలుగా ఉన్న బీసీలను తొలగించి సొంత సామాజిక వర్గాన్ని నింపుకున్నారు. ఇది బీసీ ద్రోహం కాదా.? బీసీల హక్కుల్ని కాలరాయడం కాదా.? బీసీలకు అన్యాయం చేయాలనుకున్నా, వారి హక్కుల్ని హరించాలనుకున్నా మీ అంతం తప్పదని గుర్తుంచుకోండి'' అని  హెచ్చరించారు. 

''బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. కేంద్రం అనుమతించిందని చెబుతూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. కరోనాతో ప్రపంచం భయాందోళనలో ఉంటే.. ఇళ్ల నుండి బయటకు రాకుండా పోరాటం చేస్తుంటే.. మద్యం షాపులు తెరిచి పేదలను దోచుకుంటున్నారు. మద్యం షాపులు తెరవడమంటే కరోనాను వ్యాపింపజేయడమే'' అని అన్నారు. 

''మద్యం అమ్మకాల విషయంలో కేంద్రం చెప్పిందంటున్న మంత్రులు కేంద్రం వద్దన్న పనులను ఎందుకు ఆపడం లేదు. జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం జగన్మోహన్ రెడ్డికే చెందింది. ఒక్కటంటే ఒక్క బ్రాండు కూడా ఇంతకు ముందు ఎప్పుడూ దేశంలో ఎక్కడా కనిపించలేదు. సజ్జల రామకృష్ణా రెడ్డి కుటుంబానికి చెందిన స్పై అనే కంపెనీ ద్వారా వచ్చే కల్తీ మద్యాన్ని రాష్ట్రమంతా అమ్ముతున్నారు'' అని ఆరోపించారు. 

''వైసీపీ ఎమ్మెల్యేల తీరుతో గుంటూరు, కర్నూలు, శ్రీకాళహస్తిలో కరోనా వికటాట్టహాసం చేస్తోంది. ఇప్పుడు మద్యం షాపులు తెరిపించడం ద్వారా రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్లున్నారు. టీడీపీ కార్యకర్తలు మద్యం షాపుల ముందు ఉన్నారంటూ పనికిమాలిన మంత్రి పేర్ని నాని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. మద్యం సిండికేట్ సామ్రాట్ గా పేర్ని నానికి ఎంతటి పేరుందో మచిలీపట్నంలో ఎవరైనా చెబుతారు. అలాంటి వ్యక్తి టీడీపీ గురించి, చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడు'' అని విమర్శించారు. 

''తెలుగుదేశం పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు నిబద్ధత, నిజాయితీ ఉంది. అంతేగానీ మీలా ప్రజల రక్తాన్ని పిండి జేబులు నింపుకున్న చరిత్ర మాకు లేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే.. కమిషన్ల కోసం మద్యం షాపులు తెరిపించిన వారికి టీడీపీ గురించి మాట్లాడే అర్హత లేదని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలి'' అంటూ కొల్లు రవీంద్ర మండిపడ్డారు.