గుంటూరు: శవాలతో రాజకీయాలు చేయడానికి అలవాటు పడ్డ జగన్మోహన్ రెడ్డి నేడు శవాలపై చిల్లర ఏరుకోవడానికి కూడా సిద్ధపడ్డారని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే  కింజరాపు అచ్చన్నాయుడు మండిపడ్డారు. ప్రపంచం కరోనాతో అల్లాడుతున్న సమయంలో కరోనా టెస్టింగ్ కిట్లలో కూడా వాటాలు దండుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పక్కరాష్ట్రం ఛత్తీస్ ఘడ్ రూ.337కి కొన్న కిట్లను ఏపీ ప్రభుత్వం రూ.817కి కొనుగోలు చేసిందంటే అందులో జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎంత దోచేసారో అర్థం అవుతుందని ఆరోపించారు. 

ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం పారదర్శకంగా టెండర్లు పిలిచి సప్లయర్ లేకుండా లిఫ్ట్ చేసి కూడా రూ.337కి కొనుగోలు చేసిందన్నారు. ఏపీకి అదే కంపెనీ బేసిక్ ధర రూ.730, జీఎస్టీ 12 శాతంతో కలిపి రూ.817 ఇవ్వడంలో మతలబు ఏమిటి.? అని ప్రశ్నించారు. శవాలపై చిల్లర ఏరుకున్నట్లు కరోనా కిట్ల కొనుగోళ్లలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏకంగా రూ.8 కోట్లు కొట్టేయడానికి సిగ్గులేదా.? అని విరుచుకుపడ్డారు. 

''ఒకటే కిట్.. రేటు తేడా ఉందంటే.. అందుకు 1. జే ట్యాక్స్?, 2. కమిషన్? 3. థర్డ్ పార్టీ ట్యాక్స్? ఇందులో ఏదో ఒక రకమైన లోపాయికారి ఒప్పందం జరిగి ఉండాలి. ఒక అవినీతి పరుడు అవినీతి లేకుండా ఉంటాడని ఆలోచించడమే తప్పు. హాట్ స్పాట్ లున్న ప్రాంతాల్లో దేశంలోనే మన రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. అయినా పరీక్షల విషయంలో, పరీక్షా కిట్ల విషయంలో దోచుకోవడానికి ముఖ్యమంత్రికి సిగ్గుండాలి'' అంటూ  మండిపడ్డారు. 

''మొన్న పారాసిటమాల్ వేసుకుని, బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందని వైద్యనిపుణుడిలా ఉపన్యాసాలు దంచిన ముఖ్యమంత్రి ఇప్పుడు రూ.817 పెట్టి కిట్లు కొనుగోలు చేశారని... అందులోనూ వాటాలు దండుకోవడం మీకే చెల్లింది. అధికారంలోకి వచ్చీ రాగానే మీ కక్ష పూరిత వైఖరితో విశాఖలోని మెడ్ టెక్ జోన్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు కేంద్రం ఆదేశిస్తే ఆఘమేఘాలపై ప్రారంభించారు. అదే మెడ్ టెక్ జోన్ సేవలను తొలి నుండి వినియోగించుకుంటే ఎక్కడి నుండో కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి.?'' అని  ప్రశ్నించారు.

''ఈ మధ్యే ఓ మంత్రి మెడ్ టెక్ జోన్ నుంచి అన్ని రకాల ఉత్పత్తులు మొదలయ్యాయన్నారు. అయినా కొరియా నుండి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటి.? ఇక్కడే ఉత్పత్తి చేస్తే మీకు వాటాలు రావని పక్క దేశాల నుండి కొన్నారా.? ఒక అవినీతి పరుడికి రాజ్యాధికారం అప్పగిస్తే అతని ధ్యాసంతా ఖజానాను కొల్లగొట్టడం, తన జేబులు నింపుకోవడంపైనే దృష్టి పెడతాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది'' అని ఎద్దేవా చేశారు. 

''రాష్ట్ర ప్రజలు కరోనా భయంతో భీతిల్లుతుంటే ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రాసాదాన్ని వదిలి రావడం లేదు సరికదా కనీసం ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించకపోవడం బాధాకరం. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి ముఖ్యమంత్రిగారూ...ఒడిశాలో కేవలం 60 కేసులే ఉన్నాయి. అయినా లాక్ డౌన్ పొడిగించాల్సిందేనని ముక్త కంఠంతో చెప్పారు. కేరళలో ప్రజల బతుకులకు భరోసా కల్పిస్తున్నారు. ఆకలి అనే మాట లేకుండా.. అందరికీ 20 రకాల సరుకులతో కూడిన కిట్లు అందిస్తున్నారు'' అని అన్నారు.

''పక్కనున్న తెలంగాణలో ప్రజల ప్రాణాల కంటే నాకు ఏదీ ముఖ్యం కాదని ముఖ్యమంత్రి అంటున్నారు. అవసరమైతే మరో నెల రోజులు లాక్ డౌన్ పొడిగించడానికీ వెనుకాడనని ప్రజల బతుకులకు భరోసా కల్పిస్తున్నారు. కానీ 151 మంద బలం ఉంది చెప్పుకుని విర్రవీగుతున్న మీరు ప్రజలకు ఏం భరోసా ఇచ్చారు.? ఆకలి అన్న వారికి అన్నం పెట్టే పరిస్థితి కూడా లేదు. పైగా మీ జేబులు నింపుకోవడానికి పరీక్షా కిట్లలోనూ దోపిడీకి పాల్పడుతున్నారు'' అని మండిపడ్డారు. 

''ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అనుభవం ఉన్న వ్యక్తిగా సలహాలిస్తే విమర్శలు చేస్తున్నారు. సూచనలిస్తే అవహేళన చేస్తున్నారు.  మరి 151 మంద బలం ఉందని చెబుతున్న మీరేం చేస్తున్నారు.? ఏనాడైనా ప్రజలకు భరోసా కల్పించారా.? ఏనాడైనా ప్రజల కష్టాల గురించి ఆలోచించారా..? రైతుల మద్దతు ధరల గురించి గానీ, భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకల గురించి గానీ, ఉపాధి హామీ కూలీల కడుపుకోత గురించి గానీ, బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న వలస కూలీల గురించి గానీ ఏనాడైనా ఆలోచించారా.? లక్షల విలువైన పంటలు పొలాల్లోనే కుళ్లిపోతుంటే.. ఆ రైతులకు మీరిచ్చిన ధైర్యం ఏమిటి..?'' అని నిలదీశారు. 

''ఎప్పుడూ ఎన్నికలు పెట్టేయాలి, ఏకగ్రీవాలు ఆమోదించుకోవాలి, రాష్ట్రాన్ని దోచుకోవాలి, జిల్లాకో ప్యాలెస్ కట్టుకోవాలి.. అందులో పబ్జీ ఆడుకోవాలి. అంతే తప్ప ఇంకో ఆలోచన మీకు ఉందా.? మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని చేతకాని ముఖ్యమంత్రి ఉన్నడని పక్కరాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటుంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంటే మీకు అంత మంద బలం ఉండి ఏం లాభం.? శవాలపై చిల్లర ఏరుకోవడం, శవాలను దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం ఇప్పటికైనా మానుకోండి. ప్రజల ప్రాణాలు కాపాడండి. కరోనాను అందరం కలిసి ఎదుర్కొందాం. ప్రాణాలతో బతికుందాం'' అంటూ ఏపి  ముఖ్యమంత్రి జగన్ పై అచ్చన్నాయుడు విరుచుకుపడ్డారు.