ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అధికార వైఎస్సార్ సిపి పై టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు.
సత్తెనపల్లి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబసభ్యులకే అన్యాయం చేస్తున్నాడని మాజీ మంత్రి, టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోతో పార్టీ కావాలి కానీ ఆయన భార్యకు పార్టీలో సభ్యత్వం వుండకూడదు... రాజకీయంగా యాక్టివ్ గా వున్న ఆయన తమ్ముడు భూమ్మీదే వుండకూడదు... ఇంతకన్నా మోసం ఇంకేమైనా వుంటుందా అని కన్నా అన్నారు. జగన్ పార్టీని కాదు ప్రైవేట్ లిమిటెడ్ కంపనీని నడిపుతున్నట్లు వుందంటూ కన్నా ఎద్దేవా చేసారు.
నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో సత్తెనపల్లి టిడిపి నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీ ఇంచార్జ్ కన్నా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సిపి పార్టీకి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంబంధమే లేదని అన్నారు. వైఎస్సాఆర్ ఆర్సీపీ అంటే యువజన శ్రామికరైతు కాంగ్రెస్ పార్టీ... ఇది జగన్ పార్టీ... వైఎస్ రాజశేఖర్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ అని కన్నా పేర్కొన్నారు.
వీడియో
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత చిన్న పిల్లాడిలా మారిన ఏపీని జాగ్రత్తగా అభివృద్ది చేసుకోవాల్సి వుందని కన్నా అన్నారు. కానీ వైసిపి పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ది జరగడం లేదని కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేసారు.
Read More చంద్రబాబు రోడ్ షోను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. గో బ్యాక్ అంటూ నినాదాలు, రాళ్ల దాడి
ఇక ఇటీవల సీఎం జగన్ ఓ సైకో అని... ఇటీవల ఆయన సైకోయిజం మరోసారి బయటపడిందని కన్నా అన్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడికి మంచిపేరు వస్తుందోనని పట్టిసీమ నుండి రైతులకు సాగునీరు అందకుండా వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జగన్ రెడ్డి సైకో అని తాను మొదటినుండి చెబుతున్నా... ఇప్పుడది స్ఫష్టంగా బయటపడిందని కన్నా అన్నారు.
వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచిపోయినా ఇప్పటివరకు నీటికాలువల మరమ్మతులు చేయలేదంటూ ప్రభుత్వంపై కన్నా ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ సర్కార్ పై ఆశలు వదిలేసి చాలాచోట్ల రైతులే చందాలు వేసుకుని కాలువలు బాగుచేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితులు చూస్తే రైతుల్ని ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని అనిపిస్తోందని అన్నారు.
