ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ నాయకులను కేసుల పేరుతో వేధిస్తున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ నాయకులను కేసుల పేరుతో వేధిస్తున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఎన్నికలప్పుడు మద్యం పంచి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిత్వం ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలిస్తే చాలని అన్నారు. తాను దిగజారుడు రాజకీయాలు చేయనని చెప్పారు.
ఇక, గత నెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరానని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, రాజధాని అమరావతి కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం టీడీపీ చేరానని తెలిపారు.
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి ,సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన రాజకీయ జీవితంలో సుదీర్ఘకాలం పాటు ప్రత్యర్ధిగా వున్న టీడీపీలో ఆయన చేరడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. యూత్ కాంగ్రెస్ నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా .. ఇలా దాదాపు నాలుగు దశాబ్థాల అనుభవం కన్నాకు ఉంది. దీనికి తోడు ఏపీలో అత్యంత బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం కన్నాకు అదనపు బలం. అందుకే ఆయన బీజేపీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీ, జనసేన, వైసీపీలు తమ పార్టీల్లో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, ఇతరత్రా లెక్కలు కట్టుకుని కన్నా .. తన సామాజిక వర్గానికి చెందిన జనసేనను కూడా కాదని టీడీపీవైపే మొగ్గుచూపారు.
