గుంటూరు: ప్రజల భవిష్యత్ తో ఆడుకుంటున్న దుర్మార్గ ప్రభుత్వపు దుశ్చర్యలను చూస్తున్నామని...అమరావతి నగర నిర్మాణాన్ని అధ:పాతాళానికి తొక్కేస్తున్న జగన్ వింతచేష్టలు రాష్ట్ర భవిష్యత్ కు గొడ్డలిపెట్టుగా మారాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంగళవారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ప్రజలందరూ ఒకేమాటగా, ఒకేబాటగా సాగాల్సిన సమయం వచ్చిందన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.లక్షకోట్ల అవసరమవుతాయని కొందరు ప్రభుత్వపెద్దలు, వైసీపీనేతలు చేస్తున్న వ్యాఖ్యలను కాల్వ తప్పుపట్టారు.  ఇప్పటికిప్పుడు అమరాతిలో అదనంగా చేయాల్సిన ఖర్చేమిటో చెప్పాలని అడిగారు.

డీజీపీ కార్యాలయం, సచివాలయం, శాసనసభ వంటివన్నీ రూపాయి ఖర్చు లేకుండా నడుస్తుంటే... ఎక్కడో విశాఖలో పాలనా రాజధాని నిర్మిస్తామనడం తుగ్లక్  చర్య కాక మరేమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. విశాఖలో వేలాదిమందికి ఉపాధి  కల్పించడం కోసం నిర్మించిన కార్యాలయాలను లాక్కొని, వాటిలో పాలన చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని కాల్వ ప్రశ్నించారు.

read more  జగన్ కు శిరోముండనం ఖాయం...అది తెలిసే ఆ సవాల్ పై వెనుకడుగు: పట్టాభిరామ్

జగన్ నిర్ణయం వల్ల ఒక అద్భుతమైన రాజధానిని కోల్పోవడంతో పాటు, లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పించే గనిని చేజేతులా నాశనం చేసుకుంటున్నామని టీడీపీ నేత వాపోయారు.  అమరావతి అంటే నాలుగు భవనాలు, వేలకోట్లు ఖర్చు చేయడం కాదన్నారు. ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర బిందువైన అమరావతి నుంచి అన్యాయంగా వైసీపీ ప్రభుత్వం తరిమేసిన సింగపూర్ కన్సార్టియం వంటివి ఉండి ఉంటే రూ. 50వేలకోట్ల పెట్టుబడులు వచ్చేవని కాల్వ చెప్పారు. 

అమరావతే రాజధానిగా కొనసాగుతుందని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పాడని, ఆయనతో పాటు ఎందరో వైసీపీ నేతలు జగన్ రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడని, అమరావతిలోనే ఉంటాడని, ఆయన మాటంటే తప్పడని ఊదరగొట్టారన్నారు. అటువంటి వారంతా ఏ ప్రాతిపదికన పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేశారో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. 

విశాఖ నగరం ఎక్కడో కొసన ఉందని, అక్కడ తాగునీటి వనరులు ఏమున్నాయో సమాధానం చెప్పాలన్నారు. పక్కనున్న సముద్రంలోని నీరు తాగడానికి పనికరాదనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలన్నారు. రాయలసీమకు జగన్ ద్రోహం చేస్తున్నాడని చెప్పగలనని, ఈ అంశంలో ఆయనొకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని శ్రీనివాసులు సూచించారు.  

  ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే హక్కు వైసిపి వారికి ఎవరు ఇచ్చారని కాల్వ ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ కు, ప్రభుత్వానికి విసిరిన సవాల్ పై వైసీపీలోని కీలక నేతలు ఎందుకు స్పందించడం లేదన్నారు. మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాతీర్పు కోరాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపైనే ఉందని, దీనిపై వెంటనే అధికారిక ప్రకటన చేయాలన్నారు. 

రాయలసీమ వాసులు విశాఖపట్నం వెళ్లాలంటే 1000 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాలని, సామాన్యులు, రైతులు ఎవరైనా అంతదూరం వెళ్లగలరా అని కాల్వ నిలదీశారు. విశాఖను పాలనా రాజధానిగా ఎందుకు ఎంపికచేయాల్సి వచ్చిందో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ మినహా అన్ని పార్టీలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ముందు కెళ్లాలని చూస్తున్న జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రజాపోరాటం నిర్వహించి తీరుతుందని కాల్వ స్పష్టం చేశారు.