Asianet News TeluguAsianet News Telugu

రెండో సారి అరెస్టు వల్లే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా: కళా వెంకట్రావు

తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా వైరస్ సోకడంపై టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా రావడం ప్రభుత్వం వల్లే జరిగిందని అన్నారు.

TDP leader Kala Venkat Rao on JC Prabhakar Reddy tested for corona positive
Author
Vijayawada, First Published Aug 19, 2020, 10:19 AM IST

విజయవాడ:  వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షనాయకులపై కక్ష్యసాధింపులు, వేధింపులకు పాల్పడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతోందని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అనారోగ్యం పాలు చేసి శారీరకరంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.  అక్రమ కేసులో అరెస్ట్ అయి జైళ్లో ఉన్న  జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా రావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్ష్యపూరిత వైఖరే కారణమని అన్నారు.  

జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డిని చేయని తప్పునకు తప్పుడు కేసు పెట్టి మళ్లీ జైలుకు పంపారని, రెండవసారి అరెస్ట్ చేయటం వల్లే ప్రభాకర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం కరోనాని కూడా కక్ష్యసాధింపు చర్యలకు ఆయుధంగా వాడుకుంటోందని,  వైసీపీ ప్రభుత్వం ఆఫరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు అక్రమ కేసులతో జైలుకు పంపి కరోనా రావడానికి కారణం అయ్యిందని అన్నారు. 

అత్యంత భద్రత మద్య ఉన్న ప్రభాకర్ రెడ్డికి, అచ్చెన్నాయుడికి కరోనా ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు, ప్రభాకరరెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి  పాలన గాలికొదిలి ప్రతిపక్ష నేతలపై కక్ష్యసాధించటంపై దృష్టి పెట్టారని, 16 నెలల వైసీపీ పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాల కంటే ప్రతిపక్షనేతలపై పెట్టిన కేసులే  వందరెట్లు అధికంగా ఉన్నాయని ఆయన అన్నారు. 

బుద్దుని శాంతి స్వరూపానికి చిహ్నమైన అమరావతిలో కూర్చుని జగన్  ప్రతిపక్ష నేతలని హింసించటం, వేధించటం బాధాకరమని కళా వెంకట్రావు అన్నారు.  జగన్ పాలనలో ప్రతిపక్షనేతలపై జరుగుతున్న దాడులు, వేదింపులు, కక్ష్యసాధింపులు  ఆదిమానవుని  కాలంలో కూడా  జరిగివుండవని అన్నారు. 16 నెలలకే జగన్ పాలనని  సభ్య సమాజం అసహ్యించుకుంటోందనిస జగన్ లో ప్యాక్షన్ పద్దతి మారింది తప్ప,  తన ప్యాక్ష్యన్ మనస్తత్వం మాత్రం మారలేదని అన్నారు.

గతంలో భౌతికంగా దాడులు చేసి హింసించేవారని, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులని తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్ లతో మానసికంగా హింసిస్తున్నారని ఆయన అన్నారు. అక్రమ కేసులతో కోడెల శివప్రసాదరావుని బలితీసుకున్నారని ఆయన ఆరోపించారు. మీ కక్షసాధింపు చర్యలకు ఇంకెంతమంది బలికావాలని ఆయన జగన్ ను ప్రశ్నించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయం జగన్మోహరెడ్డి గుర్తు పెట్టుకోవాలని, వైసీపీ ప్రభుత్వం ఓ వైపు కరోనా, మరోవైపు ఫ్యోన్ ట్యాపింగ్ లతో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. 

ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్రం, జీవించే హక్కును కాలరాస్తోందని ఆరోపించారు కరోనాని, ప్యోన్ ట్యాపింగ్ ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న ఏకైక ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని కళా వెంకట్రావు అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios