రైతులకు దక్కాల్సిన పరిహారాన్ని స్వాహా చేశారు: తాడిపత్రి ఎమ్మెల్యేపై జేసీ ఫైర్
రైతులకు రావాల్సిన పరిహారాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వాహా చేశారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
తాడిపత్రి: రైతులకు రావాల్సిన పరిహారాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వాహా చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారంనాడు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొక్కలు నాటిన ఏడాదికే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి రూ. 13.89 కోట్లు పరిహారం అందిందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.ఎమ్మెల్యే కు భయపడి అధికారులు పరిహారం ఇస్తున్నారన్నారు.తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు. పెద్దారెడ్డి తోటల వద్దకు వచ్చి ఈ విషయాన్ని నిరూపిస్తానన్నారు.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ పేరుతో దోచుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. తిండి నుండి దుస్తుల వరకు అన్నీ నేతన్నల నుండి దోపీడీ చేసినవేనన్నారు. ధర్మవరంలో నేసేవాళ్లు ఎంత బాధపడుతున్నారో ఎవర్ని అడిగినా తెలుస్తుందన్నారు.
తాడిపత్రికి వచ్చి ధర్మవరం ఎమ్మెల్యే ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు. దర్మవరంలో నీ ఇంటికే వస్తా ఏం చేస్తావని ఆయన సవాల్ విసిరారు. దమ్ముంటే తనను ఆపాలన్నారు.
also read:సీఐ ఫోన్ డేటా డిలీట్ చేశారు: ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
అవకాశం దొరినప్పుడల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు.ఆనందరావు ఆత్మహత్యపై కూడ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడితోనే సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
గత ఎన్నికల్లో తాడిపత్రి నుండి కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.