ఏపీలో మౌలిక సదుపాయాల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సమర్థించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజం అని, ఆయన పేర్కొన్నట్టుగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అందుకే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవద్దని సూచించారు. ఏపీ పరిస్థితులపై కేటీఆర్‌తో కలిసి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

అనంతపురం: తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఏపీలో సదుపాయాలు సరిగ్గా లేవని చేసిన వ్యాఖ్యలకు అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఓ నేత మద్దతు ఇస్తూ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని సమస్యలను మంత్రి కేటీఆర్ కళ్లకు కట్టినట్టు చూపెట్టాడని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజం అని, ఆయన పేర్కొన్నట్టుగానే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. అలాంటి వ్యాఖ్యలను కేటీఆర్ ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు.

తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యలని ఇప్పుడు కేటీఆర్ అంటున్నారని, ఆయన ప్రత్యేకించి, ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ గురించి ఆ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, తాగు నీరు, విద్యుత్ సమస్యలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమని తెలిపారు. ఆ సమస్యలపై తాను ఫొటోలు తీసి పంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. కానీ, కేటీఆర్ తాను చెప్పిన మాటలను మాత్రం వెనక్కి తీసుకోవద్దని సూచించారు. అంతేకాదు, కేటీఆర్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శిస్తున్నప్పుడు ఏపీ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని అడిగారు. 2018 ప్రభోదానంద కేసులో ఇప్పటికీ అమాయకులను చేర్చుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం పోలీసుల చేతుల కంటే కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల కనున్నల్లోనే జరుగుతున్నట్టు ఉన్నదని ఆరోపించారు.