ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్దం సాగుతుంది. ఇటీవల మరణించిన బాలిక తండ్రికి పెన్షన్ ఇస్తే తాను మంత్రికి సన్మానం చేస్తానని ప్రకటించారు.
తాడిపత్రి: ఇటీవల మరణించిన బాలిక తండ్రికి పెన్షన్ ఇప్పిస్తే తాను మంత్రి ఉషశ్రీ ఇంటికి వెళ్లి ఆమెకు సన్మానం చేస్తానని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ JC Prabhakar Reddy చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి Ushasri Charan చేసిన విమర్శలకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మంగళవారం నాడు కౌంటరిచ్చారు. శవ రాజకీయాలు చేసేది YCP వాళ్లేనని చెప్పారు. తాడిపీత్రికి వచ్చి తనపై విమర్శలు చేయడం వల్ల ఏం ఉపయోగమని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చనిపోయిన పాప తండ్రి వికలాంగుడని ఆయన గుర్తు చేశారు. పాప తండ్రికి పెన్షన్ ఇప్పించాలని మంత్రిని కోరాడు అలా పెన్షన్ ఇప్పిస్తే నీ ఇంటికి వచ్చి సన్మానం చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. గతంలో ఏ పార్టీలో ఉన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మంత్రిని కోరారు.
TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కళ్యాణ దుర్గానికి వచ్చి శవ రాజకీయాలు చేయడం సిగ్గు చేటని మంత్రి విమర్శించారు.బీసీ మహిళకు మంత్రి పదవి దక్కడంతో ఓర్వలేకనే జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని సోమవారం నాడు మంత్రి ఫైరయ్యారు. ప్రజల మద్దతు కోల్పోయిన టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆమె విమర్శలు చేశారు. వెయ్యి గొర్రెల మందలో ఒక్క గొర్రె తప్పిపోయినా ఆ గొర్రెను తీసుకొచ్చి తిరిగి ఆ మందలో కలిపే శక్తి తనకు ఉందని ఆమె చెప్పారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కళ్యాణ దుర్గానికి మంత్రి ఉషశ్రీ చరణ్ వచ్చే సమయంలో వైసీపీ కార్యకర్తలు, ఆమె అభిమానులు భారీ ఎత్తున స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి చిన్నారిని తీసుకెళ్తున్న వాహనాన్ని స్వాగత సంబరాల పేరుతో నిలిపివేయడంతో ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని బాలిక పేరేంట్స్ చెబుతున్నారు. ఈ కారణంగా తమ కూతురు చనిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. బాలిక డెడ్‌బాడీతో వారు ఆందోళనకు దిగారు.ఈ విషయమై టీడీపీ కూడా వైసీపీపై తీవ్రంగా విమర్శలకు దిగింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లు కూడా ఈ విషయమై ట్విట్టర్ వేదికగా మంత్రిపై విమర్శలు చేవారు. దీంతో వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు చంద్రబాబు, లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
