విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో 12 జిల్లాలు రెడ్ జోన్లలో ఉంటే ఏవిధంగా జగనన్న గొంతు తడి, జేబు నింపుకునే పథకాన్ని ప్రవేశపెట్టారని మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.  లాక్ డౌన్ ను సడలిస్తూ సోమవారం వైన్ షాప్స్ తిరిగి తెరవడంతో మద్యం ప్రియులు మందుకోసం ఎగబడ్డారు. దీంతో కరోనాను కట్టడి చేయడానికి ఇంతకాలం పడినశ్రమంతా వృధా అయ్యిందంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

''600 మండలాలను గ్రీన్, ఆరెంజ్ జోన్ అంటూ మద్యం షాపులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూలు, దండలు వేయించుకోవడం కూడా చూశాం. రాష్ట్రవ్యాప్తంగా తాగుడుకు అలవాటుపడిన మధ్యతరగతి, పేద వర్గాలే ప్రాణాలకు తెగించి క్యూలైన్లలో నిలబడ్డారు. లాఠీ దెబ్బలు తింటున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''జగన్ కు అసలు దూరదృష్టి ఉందా. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అనేక త్యాగాలతో, ఉపాధి లేక ఉన్న పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు.. ఉన్న నాలుగు రూపాయలతో మద్యం కోసం బారులు తీరే పరిస్థితి ఉంది. ఇందుకేనా జగన్ ఒక్క అవకాశం అని చెప్పారు. ప్రజలను నమ్మించి జగన్ మోసం చేశారు. ఎవరి అండతో మద్యం షాపులను తెరిచారు'' అని  ప్రశ్నించారు. 

''ఇప్పటికే కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతోంది. కరోనాపై తీసుకున్న చర్యలను అపహాస్యం చేసేలా జగన్ మద్యం షాపులను తెరిచారు. ప్రజలపైనే 5వేల కోట్ల అదనపు భారం వేశారు. ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు. ఇంతకంటే వేరే మార్గం లేదా'' అంటూ నిలదీశారు. 

''నాటుసారా ఏరులై పారుతోందని స్పీకరే మాట్లాడారు. మందుబాబులు లిక్కర్ కోసం మచిలీపట్నం నుంచి గూడురు వెళ్తున్నారు. తగాదాలు జరుగుతున్నాయి. రెడ్ జోన్ నుంచి ఆరెంజ్, గ్రీన్ జోన్ లోకి వెళ్తున్నారు. సామాజిక దూరం పాటించడం లేదు. క్యూలైన్లలో ఎలాంటి మాస్కులు ధరించడం లేదు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు. మీకు బాధ్యత లేదా'' అని మండిపడ్డారు. 

''జే ట్యాక్స్ కోసం మద్యం షాపులు తెరిచారు. చెత్త బ్రాండ్లను ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది మంది ప్రజలు క్యూలైన్లలో నిలబడుతున్నారు. కరోనా బారినపడి వీరి ప్రాణాలు పోతే ఎవరు సమాధానం చెబుతారు. కరోనా వస్తుందని అన్నక్యాంటీన్లను మూసేశారు. కేరళలో, గుజరాత్ లో మద్యం అమ్మకాలు జరపడం లేదు. కూరగాయలు, నిత్యావసరాల కోసం ఉదయం 6 నుంచి 9 గంటల వరకే అనుమతి ఇచ్చారు. మద్యం కోసం మాత్రం 8 గంటలు క్యూలైన్లలో ఉండే అవకాశం ఇచ్చారు. క్యూలైన్లను ఎలా సమర్థించుకుంటారో జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సమాధానం చెప్పాలి'' అని ప్రశ్నించారు. 

''వైసీపీ నేతలు హైదరాబాద్ వెళ్లి వ్యాపారాలు చేసుకుని మళ్లీ ఏపీకి వచ్చి ట్రాక్టర్ ర్యాలీలు చేస్తున్నారు. ఇలాంటి వైసీపీ నేతల నిర్వాకంతో డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు'' అని ఉమ ఆరోపించారు. 

''సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి.. పేదవారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మీడియాపై జగన్ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. మీడియా కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. టీవీ5 మూర్తిన అరెస్ట్ చేయడానికి 4 రోజులు హైదరాబాద్ లో ఉన్నారు. రమేష్ కుమార్ పై కక్షసాధిస్తున్నారు. వీటిపై సమాధానం చెప్పాలి'' అని అడిగారు. 

''లిక్కర్ పై 25శాతం ధరలు పెంచారు. దీంతో పేదలపై భారం పడుతోంది. లాక్ డౌన్ సమయంలో మద్యం షాపుల్లో మద్యంను ఎలుకలు తాగాయని చెప్పారు. అసలు షాపుల్లో స్టాక్ వివరాలు బహిర్గతం చేయాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు స్టాక్ ను తరలిస్తున్నారు. రైతులు పండించిన పంటలు అమ్ముకోలేక ఇబ్బందులు పడితే.. నేడు మద్యం కోసం లక్షలాది మంది క్యూలైన్లలో ఉన్నారు'' అని అన్నారు.

''కల్లుగీతపై అనేక ఆంక్షలు పెట్టారు. అనేక చోట్ల మహిళలు మద్యం షాపులను మూయించారు. మరోవైపు కరెంట్ బిల్లులు ఇష్టారాజ్యంగా వచ్చాయి. కరెంట్ కనెక్షన్లు కట్ చేస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ పేదవారికి అన్నదానం, నిత్యావసర సరకులు ఇస్తున్న కేశినేని నాని, బోండా ఉమ, నాగుల్ మీరా, వైవీబీ రాజేంద్రప్రసాద్, ఇతర టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకున్నారు. మద్యం షాపులను తక్షణమే మూసివేయాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి'' అని అన్నారు దేవినేని ఉమ.