ఇసుక కొరతపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు వైసీపీపై మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉచిత ఇసుకను రద్దు చేసి.. కొత్త విధానం అమల్లోకి వచ్చేలాగా వైసీపీ నేతలు, కార్యకర్తలను కుబేరులను చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వుందని ఉమా ఆరోపించారు.

సిమెంట్ కంపెనీలు బస్తాకు రూ. 5 ఇవ్వలేదని కోపంతోనే జగన్ రాష్ట్ర ప్రజలకు ఇసుకను అందుబాటులో లేకుండా చేశారని ఉమా మండిపడ్డారు. వైసీపీలో చతుష్టయంగా పేరుబడ్డ సజ్జల, గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి సిమెంట్ కంపెనీలను డిమాండ్ చేయడం నిజం కాదా అని ఉమా ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం త్వరలో మీ సేవ కేంద్రాలకు కూడా మంగళం పాడాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు ఆందోళన బాట పట్టారని... వారి భవిష్యత్తు ప్రమాదంలో పడి ఆందోళనలు చేస్తున్నా..  జగన్ ఎందుకు స్పందించడం లేదని ఉమా ప్రశ్నించారు.

గ్రామీణ స్థాయిలో రైతులకు సేవలందించే సహకార వ్యవస్థను సూతం నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు.

పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాత, ఎన్నికలు నిర్వహించడమో లేదంటే అంతకు ముందున్న సంఘాలను కొనసాగించడమో చేయాలని అలా కాకుండా వైసీపీకి చెందిన కమిటీలకు బాధ్యతను అప్పగించడం సరికాదన్నారు.

గోశాలలో 100 ఆవులు మరణించడం అత్యంత బాధాకరమని.. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఉమా డిమాండ్ చేశారు.