అమరావతి: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్ పరిశ్రమ నుండి వెలువడిన విషవాయువు 12మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. అంతేకాకుండా ఆ పరిశ్రమ చుట్టుపక్కల దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలో నివాసముంటున్న ప్రజలు ఈ విషవాయువును పీల్చి అనారోగ్యానికి గురయ్యారు. ఇలా వందలాది మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇంతటి దారుణం జరిగితే జగన్ ప్రభుత్వం బాధితులకు  ఎక్స్ గ్రేషియా ప్రకటించి కంటితుడుపు చర్యలు చేపడుతోందని... గ్యాస్ లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోడానికి వెనుకాడుతోందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. 
 
''2రోజులైనా ఎల్జీ పాలిమర్ ప్రతినిధులను ఎందుకు అరెస్టు చెయ్యడంలేదు. హైపవర్ కమిటీలో  కేంద్రప్రభుత్వ సంస్థలకి సంబంధించిన ప్రతినిధులుగాని సైంటిస్టులుగాని ఉన్నారా? విచారణకి నెలరోజులు సమయం అవసరమా? కంపెనీని బయటప్రాంతాలకు తరలించడానికి ఏంచర్యలు తీసుకుంటున్నారో  సమాధానం చెప్పండి వెఎస్ జగన్ గారు'' అంటూ జగన్ ప్రభుత్వాన్ని ఉమ ప్రశ్నించారు. 
 
''బాధితుల సంక్షేమం కోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు ఏం తీసుకుంటున్నారు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్సు బాధితులకి చేరడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు'' అంటూ సోషల్ మీడియా వేదికన జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి దేవినేని ఉమ. 

అంతకుముందే ఇదే గ్యాస్ లీకేజీ ప్రమాదంపై స్పందిస్తూ ''''లాక్ డౌన్ సమయం లో ఎల్జీ పాలిమర్స్ కి అనుమతులు ఇప్పించిన పెద్దలు ఎవరు? ప్రాణాంతకమైన విషవాయువు వదిలి పుట్టిన ప్రాంతం నుంచి ప్రజల్ని పరుగులు పెట్టించిన కంపెనీ మంచిది ఎలా అవుతుంది?  కేంద్రాన్ని ఉన్నత స్థాయి విచారణ మీరు అడుగుతారా ప్రజలని అడగమంటారా చెప్పండి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు'' అని ప్రశ్నించారు. 

''మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే LG పొలిమెర్స్ విస్తరణకి అనుమతులు ఎలా ఇచ్చారు. మీరు పెట్టిన సెక్షన్ లు సరిపోతాయా...'' అంటూ వరుస ట్వీట్లతో  ముఖ్యమంత్రి జగన్ ను నిలదీశారు దేవినేని ఉమ.