గుంటూరు: తెలుగుదేశం పార్టీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్. గత కొన్ని నెలలుగా టీడీపీలో తన ఎదుగుదల ఓర్వలేని కొందరు పెద్దలు పనిగట్టుకుని తాను పార్టీని వీడుతున్నానని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. తనకు పార్టీ మారే ఆలోచన ఏ మాత్రం లేదని చెప్పుకొచ్చారు. దయచేసి తనపై వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, దేవినేని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతానని, తన తండ్రి దేవినేని నెహ్రూ ఆశయ సాధనకై నిరంతరం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ పక్షాన, ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు.  

ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు దేవినేని అవినాష్. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని ఆరోపించారు. ఇసుక దొరక్క లక్షలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. 

ఆకలికి తట్టుకోలేక చోరీలకు పాల్పడే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొనడం దురదృష్టకరమన్నారు దేవినేని అవినాష్. ఈ నెల 24న టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక కొరత విషయంలో దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. 

టీడీపీలో యాక్టివ్ నేతలపై అధికార పార్టీ తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోందని ఆరోపించారు. తమ అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని చెప్పుకొచ్చారు. నిరుద్యోగులుకు పూర్తి స్థాయి న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దేవినేని అవినాష్.