అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం కాకుండా పూర్తిగా రద్దు చేయాలని టీడీపీ నేత దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి నామినేషన్ల ఉపసంహరణ వరకు అన్నీ అక్రమాలే జరిగాయని ఆయన అన్నారు. కేంద్ర బలగాలను పిలిపించి నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రలోభాలకు కొందరు అధికారులు లొంగిపోతున్నారని ఆయన విమర్శించారు. 

తప్పు చేసిన అధికారులను బదిలీ చేయడం కాకుండా వారిని సస్పెండ్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. పులివెందులలో ప్రత్యర్థులతో ఒక్క నామినేషన్ కూడా వేయనీయలేదని దీపక్ రెడ్డి చెప్పారు. పులివెందులను ఆదర్శంగా తీసుకుని డోన్, మాచర్లల్లో అరాచకాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 70 ఏళ్ల స్వాతంత్య్రాన్ని జగన్ ప్రభుత్వం 9 నెలల్లో హరించిందని ఆయన వ్యాఖ్యానించారు. 

Also Read: కరోనా ఎఫెక్టా, కేంద్రం ఎఫెక్టా: జగన్ పై వంగలపూడి అనిత సెటైర్లు

కొడాలి నాని భాషలో ఏపీ బీహార్ అమ్మ మొగుడిలా మారిందని ఆయన అన్నారు.  మంత్రి అనిల్ కుమార్ భాషలో చెప్పాలంటే రాజ్యంగంలో బుల్లెట్ దింపారని దీపక్ రెడ్డి అన్నారు. 

రాష్ట్రంలో ఉన్మాద, ఆటవిక, అరాచక పాలన కొనసాగుతోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారని ఆయన వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో పరిస్థితులు బిహార్‍ను మించిపోయాయని అభిప్రాయపడ్డారు. 

Also read: కరోనా దెబ్బ: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, ఆరు వారాల తర్వాత అయినా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. పోలీసులు అధికారపార్టీ ఆదేశాలు కాదు.. చట్టానికి లోబడి పనిచేయాలని కేశినేని నాని అన్నారు