Asianet News TeluguAsianet News Telugu

అన్నీ తప్పుడు కేసులే.. నిరూపించగలరా, ఆర్జీవీని మించిపోయారు: గౌతం సవాంగ్‌పై చింతమనేని ఫైర్

గౌతం సవాంగ్‌ మీడియా సమావేశంలో తాను డీజీపీ అనే విషయం మర్చిపోయారని.. ఆయన చెప్పిన యాప్‌లో తనపై ఎన్ని కేసులు లైవ్‌లో ఉన్నాయో చెప్పాలని టీడీపీ నేత చింతమనేని ప్రశ్నించారు. టీడీపీ క్యాడర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు తనను బంతిలా వాడుకుంటున్నారని కానీ ఎంత బలంగా కిందకి కొడితే అంతే వేగంతో పైకి లేస్తా అంటూ ప్రభాకర్ స్పష్టం చేశారు. 

tdp leader chintamaneni prabhakar slams ap dgp gautam sawang
Author
Amaravati, First Published Sep 4, 2021, 4:14 PM IST

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌పై మండిపడ్డారు టీడీపీ నేత చింతమనేని  ప్రభాకర్. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన అసెంబ్లీలో సీఎం జగన్‌ కట్టుకథలు బాగా చెబుతారని.. అవే కట్టుకథలు డీజీపీ కూడా బాగా వల్లెవేస్తారంటూ సెటైర్లు వేశారు. వనజాక్షి కేసును తిరగదోడాలని చూస్తున్నారని.. పోలీసులతో కేసులు పెట్టిస్తారా? ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా..? నాపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు అని చింతమనేని ఆరోపించారు. అక్రమ కేసుల సినిమా చూపించటంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌.. డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మను మించిపోయారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ క్యాడర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు తనను బంతిలా వాడుకుంటున్నారని కానీ ఎంత బలంగా కిందకి కొడితే అంతే వేగంతో పైకి లేస్తా అంటూ ప్రభాకర్ స్పష్టం చేశారు. 

గౌతం సవాంగ్‌ మీడియా సమావేశంలో తాను డీజీపీ అనే విషయం మర్చిపోయారని.. ఆయన చెప్పిన యాప్‌లో తనపై ఎన్ని కేసులు లైవ్‌లో ఉన్నాయో చెప్పాలని చింతమనేని ప్రశ్నించారు. కేసుల వివరాలు చెప్పేందుకు తన పేరు వాడాల్సిన పనేంటి? తనపై పెట్టిన అక్రమ కేసుల్లో వేటిని నిరూపించగలరు? అభియోగపత్రాలు నమోదు చేయకుండా మూసివేసిన కేసులపై ఏం సమాధానం చెబుతారు?’’ అని చింతమనేని మండిపడ్డారు.  

వనజాక్షి అంశాన్ని కూడా డీజీపీ ప్రస్తావించారని.. ఆమె సమీపంలో కూడా తాను లేనని  ప్రభాకర్ తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా నాపై ఉన్న రౌడీషీట్ కేసు ఎత్తివేయమని కోరలేదని.. వైసీపీపై అంత వ్యామోహం ఉంటే అది వేరే రూపంగా ఆ రుణం తీర్చుకోవాలంటూ డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ కుర్చీ పాకులాట కోసం తనలాంటి వారితో చెలగాటలాడటం తగదని.. తాను దోపిడీదారుడిని అయితే ప్రజలే కేసులు పెడతారని చింతమనేని తెలిపారు.  కానీ, ఏపీలో మాత్రం పోలీసులే రండి చింతమనేనిపై కేసులు పెట్టండని ఆహ్వానాలు పలుకుతున్నారంటూ ఆరోపించారు. కేసులు దొరక్క తనపై ఏవేవో కేసులు పెడుతున్నారని.. తాను చేసిన తప్పులేంటో పోలీసులు ప్రజలకు తెలియపరచాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. తనతో డీజీపీ చెలగాటం ఆడొద్దని చేతులు ఎత్తి వేడుకుంటున్నా అని చింతమనేని వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios