తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించేందుకు జగన్ కుట్ర పన్నారని, అందుకే తన గన్‌మెన్లను తొలగించారని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించేందుకు జగన్ కుట్ర పన్నారని, అందుకే తన గన్‌మెన్లను తొలగించారని ఆరోపించారు. తనకున్న ఇద్దరు గన్‌మెన్లు శుక్రవారం ఉదయం వెళ్లిపోయారని, దీనిపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తానని బీటెక్ రవి తెలిపారు. తనకు ఏదైనా జరిగితే జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిదే బాధ్యత అని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎక్కడ పోటీ చేస్తే తనకు కూడా అక్కడి నుంచే అవకాశం కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని రవి కోరారు. 

వైసీపీలో ఇన్‌ఛార్జ్‌లను , ఎమ్మెల్యేలను అటు ఇటూ మార్చుకుంటున్నారని.. అది వాళ్ల ఇష్టమని రవి పేర్కొన్నారు. అటు ఇటూ మార్చుకునే ప్రక్రియలో నిన్ను నువ్వు మార్చుకోవద్దని జగన్‌పై ఆయన సెటైర్లు వేశారు. పులివెందులలో నువ్వు లేకపోతే నా పరిస్ధితి ఏంటీ.. నిన్ను నమ్ముకుని తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తుంటే నువ్వు వెళ్లిపోతా ఎలా అని బీటెక్ రవి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

కాగా.. బీటెక్ రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించినప్పుడు రవి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ అభియోగాలు మోపారు. అయితే పోరుమామిళ్ల కేంద్రంగా భారీ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వెలుగుచూడగా.. ఈ కేసులోనే రవిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఆయన తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి.