మంగళగిరిలో టీడీపీ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు కత్తులు, కొడవళ్లతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మంగళగిరి ద్వారకానగర్‌కు చెందిన తాడిబోయిన ఉమాయాదవ్‌ (40) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. అతనికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. స్థానికంగా గౌతమబుద్ధ రోడ్డు సమీపంలో ఇటీవల తన కార్యాలయ నిర్మాణం చేపట్టాడు. ఆ పనులను ముగించుకుని మంగళవారం రాత్రి 8:20 గంటల సమయంలో ద్వారకానగర్‌లోని తన ఇంటికి బయల్దేరాడు. 

ఆ సమయంలో అతని వాహనాన్ని ప్రత్యర్థులు అడ్డగించారు. ఉమా యాదవ్, అతని సన్నిహితుడు శ్రీకాంత్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఉమా యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన శ్రీకాంత్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

కాగా ఉఉమా యాదవ్... స్థానిక టీడీపీ నేత. సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ నేత నారా లోకేష్‌ సమక్షంలో అట్టహాసంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి తన అనుచరులతో కలిసి భారీగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పాతకక్షల కారణంగానే హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.