కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి సభలో జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆ పార్టీ సీనియర్ నేత బొండా ఉమా అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు.
కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి సభలో జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆ పార్టీ సీనియర్ నేత బొండా ఉమా అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. పెద్ద మీటింగ్ జరుగుతుందని.. భారీగా జనం వస్తారని తెలిసి కూడా స్థానిక అధికారులు, పోలీసులు చోద్యం చూస్తుండటం వల్ల దురదృష్టకరమైన సంఘటన జరిగిందని అన్నారు. తొక్కిసలాట జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు సభను ఆపి బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకునేలా చేశారని చెప్పారు. చనిపోయిందని తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులని.. ఇది చాలా బాధ కలిగిస్తుందని అన్నారు.
ఇలాంటి సంఘటనలు భవిష్యతుల్లో జరగకుండా తమవైపు నుంచి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు. గతంలో ఇదే చోటగతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ, జగన్, చంద్రబాబు అందరూ మీటింగ్ ఏర్పాటు చేశారని అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు చంద్రబాబు సభకు హాజరవుతున్నారని అన్నారు. సభలకు సంబంధించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు.
వైసీపీ సభల్లో ఏదైనా ఘటన జరిగితే ఒక రూపాయి సహాయం కూడా చేయలేదన్నారు. ఈ సభకి భారీ ఎత్తున ప్రజానీకం హాజరవుతారని సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
Also Read: కందుకూరు ఘటనలో మరణించినవారి కుటుంబాలకు సీఎం జగన్ సానుభూతి.. మృతుల కుటుంబాలకు పరిహారం..
ఇక, వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనురిస్తుందని ఆరోపిస్తున్న టీడీపీ.. అందుకు నిరసనగా ‘ఇదేమి కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కందకూరులో రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. సభా వేదిక వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమిగూడటం.. సభ జరుగుతున్న సమయంలో ప్రజల్లో కొంత తోపులాటలు చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించగానే.. తొక్కిసలాట చోటుచేసుకుని కొందరు వ్యక్తులు సమీపంలోని కాలువలో పడిపోయారు. వెంటనే సభను ఆపేసిన టీడీపీ నేతలు బాధితులను ఆస్పత్రికి తరలించారు. కొంత మంది గాయాలతో మృతి చెందగా, మరికొందరు ఊపిరాడక మృతి చెందారు.
చంద్రబాబు నాయుడకు కూడా సభను నిలిపివేసి.. ఆస్పత్రి వద్దకు బాధితులను పరామర్శించారు. అనంతరం తిరిగి బహిరంగ సభ వద్దకు చేరుకున్న చంద్రబాబు నాయుడు..జరిగిన పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ సమావేశంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని అన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాల్లో చదవుకునేవారుంటే.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలందరూ మృతుల కుటుంబాలకు అండగా ఉండి.. అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వెంటనే సభను ముగించారు. ఇక, చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనపై కందుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
