న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఓటమికి చంద్రబాబు నాయుడే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని  కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని అంబికా కృష్ణ స్పష్టం చేశారు. 

సోమవారం సాయంత్రం బీజేపీలో చేరిన అంబికా కృష్ణ చంద్రబాబు నాయుడుపై ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఒక్కసారిగా రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. ఇకపోతే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు రామ్ మాధవ్.  

ఇకపోతే అంబికా కృష్ణ బీజేపీలో చేరడంతో పశ్చిమగోదావరి జిల్లాకు పెద్ద దెబ్బేనని చెప్పుకోవాలి. గతంలో ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు అంబికా కృష్ణ. అప్పటి నుంచి ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబికా కృష్ణను ఆనాటి సీఎం చంద్రబాబు ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. 

రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ఏపీ ఎఫ్డీసీ పదవికి రాజీనామా చేశారు. ఇకపోతే గతంలో మాజీమంత్రి పీతల సుజాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అనంతరం ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పారు అంబికాకృష్ణ.