రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత చర్యల కారణంగా కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపుతోందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఒకవైపు కరోనాతో జనం కకావికలమవుతుంటే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాజకీయ ప్రత్యర్థులపై కక్షతీర్చుకునే పనిలో నిమగ్నం కావడం విచారకరం అన్నారు.

ఈనెల 16వతేదీన రికార్డుస్థాయిలో 24వేల 171 కేసులు నమోదుకాగా, పొరుగున ఉన్న తెలంగాణాలో కేవలం 3,816 కేసులు మాత్రమే నమోదు కావడాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. 

అనంతపురం జిల్లాలో కోవిద్ కేర్ సెంటర్ల పర్యవేక్షణ కోసం నియమితులైన ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రత్యేక అధికారి సుబ్బరాయుడు ఆక్సిజన్ బెడ్ దొరక్క మృతిచెందిన ఘటన హృదయాన్ని కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సుబ్బరాయుడు కుమారుడు తమ తండ్రిని భుజాలపై మోసుకొని వెళ్లి ఆక్సిజన్ అందించాలని చేతులు జోడించి మొక్కినా అక్కడి వైద్యులు పట్టించుకోకపోవడంతో ఊపిరాడక మృతిచెందాడన్నారు. 

చంద్రబాబుకు షాక్: టీడీపీకి మైనారిటీ కమిషన్ చైర్మన్ గుడ్ బై...

జిల్లాస్థాయి అధికారికే ఇటువంటి పరిస్థితి ఎదురైందంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? సుబ్బరాయుడు మృతి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? తిరుపతి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మృతిచెందిన వారి జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది, దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. 

మరోవైపు రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ చాపకింద నీరులా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యాధి సోకి అయిదుగురు మృతిచెందారు. కర్నూలు, గుంటూరు జిల్లాలో ఇద్దరేసి మృతిచెందగా, తాజాగా ప్రకాశం జిల్లా చీరాలమండలం పేరాలకు చెందిన సురేష్ అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకి మృతిచెందాడు. మొత్తం ఇప్పటివరకు 23మందికి ఈ వ్యాధి సోకగా, అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 12మందిక ఈ వ్యాధి బారినపడ్డారు.  

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో  మరో 11మందికి ఈ వ్యాధి సోకడం ఆందోళన కలిగిస్తోంది.  బ్లాక్ ఫంగస్ సోకిన వ్యాధిగ్రస్తులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయడానికి 10లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతుండగా... ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్లు చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం అన్యాయం. 

ఈ వ్యాధిచికిత్స కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చే మొత్తం ఏమాత్రం సరిపోదంటూ ప్రైవేటు వైద్యశాలలు చికిత్సకు నిరాకరిస్తున్నాయి. రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు లక్షలాది రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకునే స్థోమతలేదు. బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. 

సెకండ్ వేవ్ లో తీవ్రప్రభావానికి గురైన మహారాష్ట్ర, డిల్లీ వంటి రాష్ట్రాలు విస్తృతమైన చర్యలు చేపట్టి పరిస్థితిని అదపులోకి తెచ్చుకోవడంతో అక్కడ కేసులు తగ్గుముఖం పట్టాయి. మన రాష్ట్రంలో మాత్రం కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈనెల 16వతేదీన రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 24,171 కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు అధికారికంగా కరోనాతో 9వేల 481మంది మృతిచెందారు. సోమవారం నాడు 109మంది మృతిచెందారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,554 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతుండగా మరో 2.07లక్షల మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 30శాతం మందికి ఆక్సిజన్ అవసరమవుతుండగా, అందులో కేవలం 10శాతం మందికి కూడా ఆక్సిజన్ బెడ్లు లభించని పరిస్థితి నెలకొంది. 

రాష్ట్రంలో  ముఖ్యమంత్రి అసమర్థత కారణంగా ఆక్సిజన్ అందక విజయనగరం, కర్నూలు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో 80మందికి పైగా మృతిచెందారు. తాజాగా సోమవారం కావలి ప్రాంతీయ వైద్యశాలలో ఇద్దరు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో 35మంది వరకు చనిపోతే కేవలం 11మంది చనిపోయారని తప్పుడు లెక్కలు చూపించారు. 

గత 15రోజులుగా రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టడంలో విఫలమైంది. రాష్ట్రంలో ప్రతిరోజూ వెయ్యి టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఉండగా, కేవలం 590టన్నులు సరఫరా అవుతోంది. రోగుల ప్రాణాలు కాపాడటంలో కీలకమైన ఆక్సిజన్ సరఫరాకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టకుండా తాడేపల్లిలో కూర్చుని ప్రధాని లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 

రాష్ట్రంలో ఆక్సిజన్ అందక సంభవించిన మరణాలన్నీ ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే. పొరుగున కేరళ రాష్ట్రంలో మనకంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవడమేగాక ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిల్లో ఆక్సిజన్ అవసరమైన వారి ప్రాణాలు గాలిలో దీపంగా తయారయ్యాయి.  గత రెండునెలలకు పైగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మొద్దునిద్రపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

రాష్ట్రప్రభుత్వ చేతగానితనం కారణంగా వ్యాక్సినేషన్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటివరకు తొలివిడత వ్యాక్సినేషన్ పూర్తయిన 73లక్షలమందిలో 40శాతం కూడా రెండోదశ వ్యాక్సినేషన్ పూర్తికాలేదు. 

కేంద్రప్రభుత్వం వ్యాక్సిన్ల కొనుగోలుకు అవకాశం ఇచ్చినప్పుడు ఆర్డర్ పెట్టకుండా నిర్లక్ష్యం వహించిన ఫలితంగా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో అతితక్కువ మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాక్సిన్ కొనుగోలుపై దృష్టిపెట్టడం మాని కోవాగ్జిన్ వంటి ప్రఖ్యాత కంపెనీకి కులంరంగు అంటగట్టడం ఆయన అవివేకానికి నిదర్శనం. 

కోవిద్ వ్యాధిని అరికట్టడంలో కీలకమైన వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి కరోనా మహమ్మారిని అరికట్టడంపై దృష్టిసారించాలి. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు 10లక్షలు, ఆక్సిజన్ అందక మృతిచెందిన వారి కుటుంబాలకు 25లక్షలరూపాయల పరిహారాన్ని అందజేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు.