డ్వాక్రా గ్రూపు సభ్యురాలి సంతకాల ఫోర్జరీతో ధాన్యం కొనుగోలు లావాదేవీలు చేసిన టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డ్వాక్రా గ్రూపు సభ్యురాలి సంతకాల ఫోర్జరీతో ధాన్యం కొనుగోలు లావాదేవీలు చేసిన టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు.. ఆమె కుమార్తెపై కూడా కేసు నమోదైంది. ఈ సంఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... గన్నవరం మండలం దావాజిగూడెం ఉజ్వల గ్రామ సమాఖ్య సంఘంలోని రసూల్ స్వయం సహాయక సంఘంలో షేక్ రిజ్వానా సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో 2016, ఫిబ్రవరిలో మూడుసార్లు మొత్తం రూ.7.60 లక్షలు జమయ్యాయి.
దీనిపై అప్పటి గ్రామ సమాఖ్య సంఘం అధ్యక్షురాలు, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి గొంది రాణిను ఆమె ప్రశ్నించగా.. . బ్యాంక్ ఖాతాలు లేని రైతుల ధాన్యం కొనుగోలు మొత్తాన్ని జమచేసేందుకు రిజ్వానా అకౌంట్ ఇచ్చినట్లు చెప్పింది. అనంతరం డబ్బు డ్రా చేసి రాణి, ఆమె కుమార్తె ప్రగతికి ఇచ్చింది.
అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రూ.కోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తన పేరిట జరిగిన ధాన్యం విక్రయ పత్రాల్ని రిజ్వానా పరిశీలించగా.. ట్రాక్‌షీట్, రైతు కొనుగోలు ధ్రువపత్రం, రైతు చెల్లింపు తదితర పత్రాలపై ఆమె సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది. దీనిపై జిల్లా కలెక్టర్, వెలుగు అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వెలుగు అధికారులు విచారణ జరిపి రిజ్వానా సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. రాణి ఫోర్జరీ సంతకాలు చేసినట్లు తేలింది. ఆమెకు కుమార్తె ప్రగతి కూడా సహకరించినట్లు తేలింది. దీంతో వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
