అమరావతి: తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికై వైసీపీకి మద్దతు ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్సీలకు టీడీపీ విప్ జారీ చేసింది. శాసన మండలిలో రేపు(బుధవారం) వివిధ బిల్లులపై జరిగే  ఓటింగ్ కు హాజరై పార్టీ తరపున ఓటు వేయాలని టిడిపి తరపున ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఈ విప్ జారీ చేశారు.  ఎమ్మెల్సీలు సీహెచ్ శివనాధరెడ్డి, పోతుల సునీత, పి.శమంతకమణికి విప్ జారీ చేస్తూ నోటీసులు పంపించారు. 

శాసనమండలిలో సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై ఓటింగ్ జరిగినా సిద్ధమవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా టీడీపి ఎమ్మెల్సీ లకు విప్ జారీ చేసింది. ఈ క్రమంలోని టిడిపి సభ్యులతో పాటు గత అసెంబ్లీ సమావేశాల సందర్భంలో అధికార వైసిపికి మద్దతిచ్చిన ముగ్గురు ఎమ్మెల్సీలకూ విప్ జారీ చేసింది. 

read more  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2020-21: హైలైట్స్

సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి బిల్లులకు ఏపీ అసెంబ్లీ మంగళవారం నాడు ఆమోదం తెలిపింది. ఈ రెండు కీలక బిల్లులకు ఇవాళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఏపీ అసెంబ్లీలో  వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ బిల్లులను ప్రవేశపెట్టారు.ఈ బిల్లులను మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ప్రవేశపెట్టారు. 

కోర్టులో ఉన్న బిల్లులను మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం సరైంది కాదని బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల అభ్యంతరాలను ఖాతరు చేయకుండానే ఏపీ ప్రభుత్వం ఈ రెండు బిల్లులను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 

ఈ రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ది బిల్లులు శాసనమండలి సెలెక్ట్ కమిటికి పంపింన విషయం తెలిసిందే. అయితే సెలెక్ట్ కమిటిని ఇంకా ఏర్పాటు చేయలేదు. 

సెలెక్ట్ కమిటి ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఏపీ హైకోర్టులో ఇటీవలనే పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఈ బిల్లులను అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తెలపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.