అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ కాంపైన్ మరోకొత్త కాంపైన్ స్టార్ట్ చేసింది. జగన్ ఫెయిల్డ్ సీఎం అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విమర్శల దాడి చేస్తోంది. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ఈ కాంపైన్ ను స్టార్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నారా లోకేష్ విమర్శల అనంతరం జగన్ ఫెయిల్డ్ సీఎం అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. అంతేకాదు తన విమర్శలను సీఎం జగన్ కు సైతం ట్యాగ్ చేశారు నారా లోకేష్.

నిరుద్యోగులంటే సీఎం జగన్ కు కక్ష అంటూ విమర్శించారు. ఎందుకు అంత కక్షో జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే వాళ్ల మీద కేసులు పెడతారా...? సిగ్గులేదా అంటూ నిలదీశారు. 

గ్రామవాలంటీర్ పేరుతో వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయ పరీక్షా పత్రాలు లీక్ చేసి  20లక్షల మంది నిరుద్యోగులను నట్టేట ముంచారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు నారా లోకేష్. 

అంతేకాదు జగన్ తన పాదయాత్రలో కోటి 70 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి యువతను ఉద్ధరించేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇచ్చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన జగన్ ఉద్యోగాలు ఇవ్వకపోగా వారిపై కేసులు పెడుతున్నారంటూ తిట్టిపోశారు. 

ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి మోసం చేయడంతో వారు ఆందోళనకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆందోళన చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారా అంటూ విమర్శించారు. 

గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం అనంతపురం జిల్లాలో ధర్నా చేసిన 22 మంది నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను జగన్ ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని మాజీమంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.