అనంతపురం: నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే తాను బీజపీలో చేరాల్సి వచ్చిందని స్పష్టం చేశారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలను చూసి బాధ కలిగిందన్నారు. 

బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా ధర్మవరం నియోజకవర్గానికి వచ్చిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాను ఎందుకు టీడీపీ వీడాల్సి వచ్చింది, బీజేపీలో చేరిన విషయంపై కార్యకర్తలతో చర్చించారు. 

వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే నియోజకవర్గంలో ఒక కార్యకర్తను నిర్ధాక్షిణ్యంగా చంపడం బాధ కలిగించిందన్నారు. అందువల్లే తాను బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. 

తనను నమ్ముకున్న కార్యకర్తలకు బాసటగా నివాలనుకున్నానని, అలాగే దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషించుకుని టీడీపీని వీడి బీజేపీలో చేరినట్లు తెలిపారు. 

తెలుగుదేశం పార్టీ వీడటం చాలా బాధగా ఉందని వరదాపురం సూరి భావోద్వేగానికి గురయ్యారు. కంటతడిపెట్టారు. 2023లో జరిగే జమిలి ఎన్నికల్లో మోదీ, అమిత్ షా నాయకత్వంలో రాష్ట్రంలో కూడా బీజేపీ విజయం సాధిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  తనను నమ్ముకున్న ప్రతీ ఒక్కరికి అండగా ఉంటూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని వదాపురం సూరి స్పష్టం చేశారు.