టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు త్వరలో బీజేపీలో చేరనున్నారంటూ గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే బీజేపీలో చేరతానని కూడా చెప్పారు. అయితే... ఆయన ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. సడెన్ గా యూటర్న్ తీసుకోని..బీజేపీకాదని.. వైసీపీలోకి వెళ్లాలని ఉత్సాహం చూపిస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇందుకు కారణం లేకపోలేదు. మొన్నటి వరకు వైసీపీ పై విమర్శలు చేసిన రాయపాటి.. తాజాగా ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయపాటి ప్రశంసలు కురిపించారు. జగన్ పాలన చాలా బాగుందంటూ కితాబు ఇచ్చారు.. జగన్ పథకాలను కూడా మెచ్చుకున్నారు.

నవరత్నాలు పథకానికి నిధుల కొరత ఉందని.. అయితే  కేంద్రం మాత్రం రాష్ట్రానికి సహకరించడం లేదని రాయపాటి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నూతన టెండర్లు పిలవడం వల్ల వ్యయం పెరుగుతుందని ఆయన భావించారు. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరాలని అనుకుంటున్నానో ప్రకటిస్తానని పేర్కొన్నారు.

ఈ కామెంట్స్ విన్నవారంతా రాయపాటి వైసీపీలో చేరడం ఖాయమని  చెబుతున్నారు. అందుకే జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి దీనిలో నిజం ఎంతుందో తెలియాలంటే... మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.